సామాజిక న్యాయం కోసం మన పోరాటం | - | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయం కోసం మన పోరాటం

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

● హొసూర్‌ సభలో సీఎం స్టాలిన్‌ గర్జన

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హొసూర్‌లో నిర్వహించిన శ్రీ ఇండియా కూటమి ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడమే కాకుండా, ద్రావిడ సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం , అందరికీ సమానమైన అభివృద్ధికి నిలయమైన ఈ గడ్డపై నిలబడి ప్రసంగించడం తనకు గర్వంగా ఉందన్నారు. హొసూర్‌ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది, దీనిని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తాం అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

నేను ఒంటరిని కాదు

ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. నేను ఒంటరిగా ఉన్నానని కొందరు అంటున్నారు. కానీ నేను ఒంటరిని కాదు.. నాకు కోట్లాది మంది ప్రజల మద్దతు ఉంది. భారతదేశానికే గౌరవం, హేతువాదం, క్రమశిక్షణను నేర్పిన పెరియార్‌, అన్నాదురై, కలైజ్ఞర్‌ కరుణానిధిల ఆశయాలు నా వెన్నంటే ఉన్నాయి. ఇది వారి సిద్ధాంతాలతో పునీతమైన మట్ట్ఙి అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

మహిళా సాధికారత

డీఎంకే ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వారసత్వ రాజకీయాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్యమని, ప్రజలే తమను ఎన్నుకున్నారని, తాము ప్రజల సేవకులమని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన హొసూర్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రచారసభలో స్టాలిన్‌తో పాటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైన్నెకు చేరుకున్న స్టాలిన్‌, ఇక్కడి పలు నియోజకవర్గాలలో రోడ్‌ షో నిర్వహించారు. ఒకే సమయంలో ఓ వైపు స్టాలిన్‌, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రోడ్‌ షో చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement