మైలం ఓటర్ల మనసు గెలిచేదెవరో..? | - | Sakshi
Sakshi News home page

మైలం ఓటర్ల మనసు గెలిచేదెవరో..?

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సీవీ షణ్ముగం పోటీ

డీఎండీకే అభ్యర్థిగా ఎల్‌. వెంకటేశన్‌

ఆసక్తికరంగా కుల సమీకరణల

రాజకీయ

సాక్షి, చైన్నె: రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో కీలక పార్టీ తరపున చక్రం తిప్పుతున్న నేత తాజాగా ఆ పదవి కన్నా, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొనసాగడం ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలోకి వస్తే మంత్రి పదవీ కెబినెట్‌ హోదాలో దర్జాగా కొనసాగ వచ్చు అన్న ధీమాతో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఈ సారి మైలం నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఇక్కడి సామాజిక వర్గం ఓటు కలిసి వస్తాయన్న ఆశతో ఆయన పోటీలో నిలబడితే అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వెంకటేషన్‌ డీఎంకే కూటమిలో డీఎండీకే అభ్యర్థిగా రేసులో నిలవడం పోటీ రసవత్తరంగా మారింది. వివరాలు.. తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల మేళవింపుతో ఉన్న ఆరణి లోక్‌సభ నియోజకవర్గంలో మైలం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. వెనుకబడిన ప్రాంతంగా, కేవలం కుల సమీకరణలు రాజ్య మేలుతున్న ప్రాంతంగా ఉన్న మైలంలో ఎన్నికల సమరం వేడెక్కింది. ఇక్కడ కొండమీదున్న మైలం మురుగన్‌ ఆలయం ప్రసిద్ది చెంది ఉంది. 2008 పునర్‌ వ్యవస్థీకరణ తదుపరి కొత్తగా ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో తొలి ఎన్నికలలో అన్నాడీఎంకే గెలిచింది. 2016లో డీఎంకే విజయకేతనం ఎగుర వేయగా, 2021లో పీఎంకే అభ్యర్థి శివకుమార్‌ గెలిచారు. ఈ నియోజకవర్గాన్ని గురి పెట్టి సీవీ షణ్ముగం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు సఫలీకృతుడయ్యారు. తాజాగా ఇక్కడ 2,12,788 మంది ఓటర్లు ఉన్నారు.

గెలుపును నిర్ణయించే అంశాలు ఇవే..

కుల సమీకరణాలే ఈ నియోజకవర్గంలో కీలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో కూడిన ఈ పరిసరాలలో వన్నియర్‌ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. పీఎంకే లో వివాదాల నేపథ్యంలో ఈ ఓట్లు సి.వి. షణ్ముగం వైపు ఉంటాయా లేదా చీలిపోతాయా? అన్నది వేచి చూడాల్సిందే. ఇక, డీఎంకే కూటమి ఓట్లు వెంకటేశన్‌కు ఏకపక్షంగా పడతాయా..? లేదా..? అనే సందిగ్ధం నెలకొంది. ఇక, తాలూకా ఏర్పాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన వంటి సమస్యలెన్నో గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడ ఉన్నాయి.

మెలం మురుగన్‌ ఆలయం

ఎమ్మెల్యే కావాలన్న ఆశతో..

రాజ్యసభ సభ్యుడిగా, అన్నాడీఎంకేలో కీలక నేతగాఉన్న సీవీ షణ్ముగం మైలం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన విల్లుపురం నుంచి రెండు సార్లు గెలిచారు. హ్యాట్రిక్‌ కోసం 2021లో ప్రయత్నించగా ఓటమి పాలయ్యారు. దీంతో తన మకాంను మైలంకు మార్చుకున్నారు. ఓ వైపు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, మరో వైపు మైలం నియోజకవర్గంపై తన పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో, తన సామాజికవర్గంతో మమేకం అయ్యేవిధంగా ముందుకు సాగారు. ప్రస్తుతం మైలం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అన్నాఎంకే అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ కావడంతోనే ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీలో ఉండడం గమనార్హం. ఇక, డీఎంకే కూటమిలో ఈ సీటును డీఎండీకేకు కేటాయించారు. కూటమి బలం, కెప్టన విజయకాంత్‌పై ఈ పరిసరాలలో ఉన్న సానుభూతి తననను గెలిపిస్తుందన్న ఆశతో ఉన్నారు.ఇక, విజయ్‌ పార్టీ నుంచి టీవీకే తరపున విజయ్‌ నిరంజన్‌ పోటీ చేస్తున్నారు. యువత ఓట్లు, మార్పును ఆశిస్తున్న వారిని గురి పెట్టి ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. సీమాన్‌ ఎన్‌టీకే తరపున విజయ్‌ విక్రమ్‌ పోటీలో ఉన్నారు. మధ్యతరగతి, విద్యావంతుల ఓట్లపై దృష్టి పెట్టారు. కాగా ప్రధాన సమరం సీవీ షణ్ముగం, వెంకటేషన్‌ మధ్య నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement