సేలం : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంలో శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, టీవీకే కన్వీనర్ సెంగోట్టయ్యన్‌పై ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెంగోట్టయ్యన్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రవర్తన సరిగ్గా లేదని, స్వయంగా ఆయన భార్య, కుమారుడే సచివాలయానికి వచ్చి జయలలితకు ఫిర్యాదు చేశారని ఈపీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫిర్యాదుల వల్లే అప్పట్లో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అలాంటి వ్యక్తిని తన మంత్రివర్గంలోకి తీసుకుని పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వల్ల సింధు రవిచంద్రన్ వంటి ఎందరో నేతలు ఇబ్బందులు పడ్డారని, పార్టీని వీడారని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎవరైనా ’అమ్మ’ (జయలలిత) శైలిలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
డీఎంకే గూఢచారి
అసెంబ్లీలో డీఎంకేకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేని సెంగోట్టయ్యన్, నిజానికి ఒక డీఎంకే గూఢచారి అని మండిపడ్డారు. స్టాలిన్ సమక్షంలో ఆయన వ్యవహరించిన తీరును ఎండగడుతూ, ఆయన అన్నాడీఎంకేకు విధేయుడు కాదని తేల్చి చెప్పారు. రాజకీయంగా మాట్లాడటం మానేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే, తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయటపెడతానని సెంగోట్టయ్యన్‌ను హెచ్చరించారు. అప్పుడు గోబిచెట్టి పాళయం రోడ్ల మీద నడవలేవు, ప్రజలు నీపై ఉమ్మివేస్తారు అని ఈపీఎస్ ఘాటుగా హెచ్చరించారు.


