● హక్కులను పరిరక్షించుకోండి ● ఓటర్లకు పీఎం మోదీ పిలుపు | - | Sakshi
Sakshi News home page

● హక్కులను పరిరక్షించుకోండి ● ఓటర్లకు పీఎం మోదీ పిలుపు

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

● హక్కులను పరిరక్షించుకోండి ● ఓటర్లకు పీఎం మోదీ పిలుపు

సాక్షి,చైన్నె: తమిళనాడుకు ఎక్కువ ఎంపీ సీట్లు రావడం డీఎంకేకు ఇష్టం లేదని, హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న ఈ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కోయంబత్తూరులో ఎన్‌డీఏ కూటమికి మద్దతుగా మోదీ ప్రసంగించారు. వేదికపై కోయంబత్తూరు, పరిసర జిల్లాలోని ఎన్‌డీఏ అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేశారు. ఈసందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, నియోజకవర్గాల పునర్విభజన రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగితే, తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే మరిన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు లభిస్తాయన్నారు. దీని వలన దేశ రాజకీయాల్లో తమిళనాడు బలం పెరుగుతుందన్నారు. అయితే, తమిళనాడు శక్తి పెరగడం డీఎంకేకు ఏమాత్రం ఇష్టం లేదని మోదీ విమర్శించారు.

సంస్కృతికి ప్రాధాన్యత

తన ప్రసంగాన్ని కోయంబత్తూరు గ్రామ దేవత కోనియమ్మన్‌, మరుదమలై మురుగన్‌ (సుబ్రహ్మణ్య స్వామి) పేర్లను స్మరిస్తూ వ్యాఖ్యలు చేశారు. తమిళ సంస్కృతి , సంప్రదాయాలను గౌరవించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. కొత్త ఆశలు – కొత్త శక్తి అన్నది త మిళ నూతన సంవత్సరం వేళ తమిళనాడు రాజకీయాల్లో మార్పు మొదలైందన్నారు. ప్రజలు కొత్త ఆశలతో ఎన్డీయే వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి కేవలం ‘ద్వేషపూరిత రాజకీయాలకే‘ పరిమితమయ్యాయని మండది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.

ఎన్డీయే కూటమిదే అధికారం

ఎన్‌డీఏ కూటమిదే తమిళనాట అధికారం అని పేర్కొంటూ భారీ మెజారిటీతో గెలిపించడం ప్రజల బాధ్యతగా వ్యాఖ్యలు చేశారు. డీఎంకేకు రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ రాజకీయాలకే ఎక్కవ అని మండి పడ్డారు. ఢిల్లీ పార్లమెంట్‌లో తమిళనాడు గొంతు బలంగా వినబడాలనేదే బీజేపీ లక్ష్యం అని, తమిళనాడు ప్రజల ప్రయోజనాల కంటే తమ స్వార్థ రాజకీయాలే డీఎంకేకు ముఖ్యంగా మండి పడ్డారు. నియోజకవర్గాల విభజన ద్వారా తమిళనాడుకు వచ్చే అదనపు బలాన్ని చూసి వారు భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంగు మండలం కూటమి కోట

అన్నాడీఎంకే ప్రధానకార్య దర్శిపళణి స్వామి ప్రసంగిస్తూ , కొంగు మండలంలోని 23 స్థానాల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తిరుప్పూర్‌, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నామన్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం మాత్రమే కాదని, తమిళనాడును దోచుకుంటున్న ఒక కుటుంబానికి (డీఎంకే), రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకే ఈ కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement