సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను బెదిరించడం లేదా లొంగదీసుకోవడం ప్రధాని మోదీ, అమిత్ షా తరంకాదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, షోళింగర్, తిరుచ్చి జిల్లా తురైయూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. సుడిగాలి పర్యటనతో శనివారం సాగిన ప్రచారాలలో రాహుల్‌గాంధీ తమిళులను ఆకర్షించే విధంగా ప్రసంగించారు.
బొమ్మ ముఖ్యమంత్రి కుట్ర
ఈ ఎన్నికలు సాధారణమైనవి కావని రాహుల్ పేర్కొన్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని తొలగించి, తమ మాట వినే ఒక ‘బొమ్మ ముఖ్యమంత్రి’ని కూర్చోబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. గతంలో అన్నాడీఎంకే ఒక గొప్ప పార్టీగా ఉండేది, ఇప్పుడు అది బీజేపీకి మాస్క్‌గా మారిపోయిందని విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన
మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనను తీసుకురావడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల గళాన్ని పార్లమెంటులో నొక్కేయాలని బీజేపీ చూసిందన్నారు. కానీ విపక్షాలన్నీ కలిసి ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాయన్నారు. తమిళనాడుతో తనకున్నది కేవలం రాజకీయ సంబంధం కాదని, ఇది ప్రేమతో కూడిన బంధం అని వ్యాఖ్యానించారు. తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ కాలం నుండి కొనసాగుతున్న అనుబంధమన్నారు. తాను ఢిల్లీలో తమిళ ప్రజల ప్రతినిధిగా, సైనికుడిగా పనిచేస్తానన్నారు. తమిళనాడు కోసం గళమెత్తుతానని రాహుల్ భావోద్వేగంగా ప్రసంగించారు.
తమిళనాడు గడ్డతో కాంగ్రెస్‌కు విడదీయరాని బంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హస్తినలో తమిళుల సైనికుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం విస్తృతంగా పర్యటించారు.


