సాక్షి, చైన్నె: అరాచకాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ‘లిమిటెడ్ కంపెనీ’ డీఎంకేను ఈ ఎన్నికల్లో ప్రజలు ‘లిమిట్’ చేసి, ఇంటికి పంపడం ఖాయమని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
ప్రచారానికి ఆటంకాలు
అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని టీవీకే అభ్యర్థుల ప్రచారానికి డీఎంకే అడ్డంకులు సృష్టిస్తున్నదని విజయ్ ఆరోపించారు. ప్రచార అనుమతులను చివరి నిమిషంలో రద్దు చేయడం, అనుమతి పత్రాలను ఆలస్యంగా ఇవ్వడం వంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీవీకే కేవలం రోడ్లపై చేసే ప్రచారాన్నే నమ్ముకోలేదని, తమిళనాడులోని ప్రతి ఇంట్లో ప్రజలే స్వచ్ఛందంగా తమ తరపున ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, అవినీతి శక్తులు, పాసిస్టు శక్తులు త్వరలోనే ‘విజిల్’ (టీవీకే గుర్తు) ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయం‘ అని ధీమా వ్యక్తం చేశారు. హద్దులు లేకుండా అవినీతి చేస్తూ, అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న ‘లిమిటెడ్ కంపెనీ’ డీఎంకే అధికారానికి ఈ ఎన్నికల్లో ప్రజలు చెక్ పెడతారని ఆయన అన్నారు. ‘ప్రజలారా.. ఈ వేషధారులను నమ్మకండి, అప్రమత్తంగా ఉందాం. విజయం సాధించి చరిత్ర సృష్టిద్దాం అని విజయ్ పిలుపునిచ్చారు. కాగా, విజయ్ ఈనెల 20,21 తేదీలలో తిరుచ్చిలో విస్తృతంగా పర్యటించేందుకు నిర్ణయించారు.
ప్రచారంలో విజయ్
దిశానిర్దేశం మార్చే కుట్ర
ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం డీఎంకేకు అలవాటేనని, పెట్టుబడుల పేరుతో డీఎంకే ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని విజయ్ విమర్శించారు.పెరియార్, కామరాజర్, అన్నాదురైలు నాటిన సామాజిక న్యాయం, సామరస్య బీజాలు ఈ మట్టిలో బలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి లౌకిక గడ్డపై పాసిస్టు శక్తులు పాచికలు అసాధ్యమన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న డీఎంకేకు మరోసారి అవకాశం దక్కడం కల్లేనని ఆయన స్పష్టం చేశారు.


