సాక్షి, చైన్నె: ప్రముఖ రచయిత్రి, గాయని డా. గుమ్మడి రామలక్ష్మి రచించిన రంజని గజళ్ల పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఐఐటీ మద్రాసులోని ఐసీఎస్ ఆర్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ఆచార్య పద్మశ్రీ కామకోటి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ డైరెక్టర్, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు గౌరవ అతిథిగా, వీణావాయిద్యకారిణి, కళాకారిణి శారదా తోటతరణి, ఆత్మీయ అతిథిగా , తెలుగు తరుణి అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసల రమణి, రేణుకా కామకోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా విద్యార్థి మోక్షజ్ఞ, ప్రార్థనా గీతం ఆలపించారు. అల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత సుష్మిత సభకు అతిథులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి హాజరయ్యారు. విద్యార్థుల డీన్, ప్రొఫెసర్ గుమ్మడి సత్యనారాయణ కామకోటిని శంకర రావుని,తోటతరణిని శాలువాతో సత్కరించారు. రచయిత్రి రామలక్ష్మి, శారదా తోటతరణిని, కాసల రమణిని, రేణుకా కామకోటిని సన్మానించారు. తర్వాత కామకోటి రంజని గజళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, రంజని అనేది రాగం పేరు అని, రంజని రాగం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఐఐటి మద్రాసులో ఆచార్యులు శాస్త సాంకేతికంగా కృషి చేసి అభివృద్ధిని సాధిస్తుంటే రామలక్ష్మి తన సృజనాత్మకతతో సంగీతం సాహిత్యం పట్ల ప్రగతిని సాధిస్తున్నారని ప్రశంసించారు. సంగీత దర్శకుడు ఇళయరాజా విద్యార్థులకు సంగీతం నేర్పించడానికి ప్రత్యేక భవనం నిర్మిస్తున్నామని, ఆవరణలో విద్యార్థులు , అందరికోసం ఒత్తిడి తగ్గించడానికి ఆహ్లాదకరమైన వాతావరణంతో మ్యూజిక్ ఫౌంటైన్ నిర్మిస్తున్నామని, అది ఏడు వారాలు ఏడు రాగాలతో సంగీతం వినిపిస్తుందని తెలిపారు.


