ఉదయ నిధిని సీఎంగా అంగీకరించే ప్రసక్తే లేదు! | - | Sakshi
Sakshi News home page

ఉదయ నిధిని సీఎంగా అంగీకరించే ప్రసక్తే లేదు!

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

● కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

సాక్షి, చైన్నె: ఉదయనిధిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. తమిళ సంస్క్కతికి, మహిళలకు వ్యతిరేకంగా మనస్తత్వం కలిగిన ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. నీలగిరి జిల్లా ఊటీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భోజరాజన్‌కు మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు.

కూటమి విజయం

ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని జాతీయ ఎన్‌డీఏ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తుందన్నారు. మే 4న కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు సేవ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్‌ కుటుంబం వలన తమిళనాడులో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. స్టాలిన్‌, ఉదయనిధి, శబరీశన్‌, కనిమొళి ఇలా ఒకే కుటుంబం చేతిలో పాలన బందీ అయిందన్నారు. టాస్మాక్‌ (మద్యం), భూ కేటాయింపులు ఇలా ప్రతి శాఖలోనూ అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు..

ఉద్యోగాల కోసం లంచాలు

తమిళనాడులో యువత ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. స్టాలిన్‌ తన వారసుడు ఉదయనిధిని ముందుగా ఉప ముఖ్యమంత్రిని చేసి, ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని చేయాలనే పథకం పన్నారని, అయితే, ప్రజలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఒకే కుటుంబం సాగిస్తున్న అవినీతి, అధ్వాన్నపు పాలన త్వరలోనే ముగుస్తుందని, బీజేపీ అన్నాడీఎంకే, పీఎంకే, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం తదితర తదితర కూటమి పార్టీలన్నీ ఒకే కుటుంబంలా ప్రజల కోసం శ్రమిస్తున్నాయన్నారు. కాగా, ఊటికి హెలికాఫ్టర్‌లో మంత్రి వచ్చారు. దీంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌వర్గాలు ఆయన హెలికాఫ్టర్‌ను, ఆయన కోసం సిద్ధం చేసిన వాహనాలను తనిఖీలు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement