పరిపూర్ణానందగిరి స్వామి
ఏర్పేడు: మండల కేంద్రంలోని మహర్షి సద్గురు మలయాళ స్వామి స్థాపించిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవ్యాసాశ్రమం శతజయంతోత్సవాలు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి శనివారం తెలిపారు. ఆయన వ్యాసాశ్రమంలోని అధిష్టాన మందిరంలో మాట్లాడుతూ మలయాళ స్వామి ఏర్పేడులో శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతజయంతోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలుత మే నెల 2వ తేదీ నుంచి ఉత్సవాలు జరపాలని భావించినా, అనివార్య కారణాల రీత్యా ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శ్రీవ్యాసాశ్రమం ప్రాంగణంలో జరగనున్న ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి అనేక మంది పీఠాదీశులు, మఠాదీశులు, సాధు మహర్షులు హాజరు కానున్నారని తెలిపారు. వారం రోజుల పాటు విశేష యాగపూజలు, హోమాలు, సద్గురువుల ఉపన్యాసాలు తదితర కార్యక్రమాలు జరగనున్నట్లు వెల్లడించారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసే వ్యాసాశ్రమ భక్తులకు వారం రోజులు ఆశ్రమంలో వసతి, అన్నదానం వంటి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరై సద్గురు మలయాళ స్వామి దివ్యాశీస్సులు పొందాలని కోరారు.


