డీఎంకే–కాంగ్రెస్‌ది
తిరువళ్లూరు: డీఎంకే–కాంగ్రెస్ మద్య అనుబంధం నలభయ్యేళ్ల నాటిదని, ఎవ్వరు కుట్ర చేసినా తమ బంధాన్ని విడదీయలేరని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని జరిగిన భారీ బహిరంగ సభకు రాహుల్‌గాంధీతోపాటు డీకే శివకుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మతతత్వ పార్టీలు తమ బంధాన్ని విడదీయడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. తమిళనాడులో వచ్చే ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించిన ఆయన ఇండియా కూటమికి అండగా తమిళ ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. ఆంగ్లేయుల కాలంలో కూడా విద్యార్థులను పాఠశాలలో చేర్పించే సమయంలో మాతృభాషను అడిగి బడిలో చేర్చుకున్నారని, అయితే ప్రస్తుతం తమిళనాడులో హిందినీ బలవంతంగా రుద్దడం సరికాదని వ్యాఖ్యానించారు. హిందీ భాషను వ్యతిరేకించడంతో పాటు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తమిళనాడు ఎంపీలు ధీటుగా ఎదుర్కొని ఓడించారని ప్రశంసించారు. అనంతరం ఆవడి నాజర్(డీఎంకే), తిరువళ్లూరు వీజీ రాజేంద్రన్(డీఎంకే), గుమ్మిడిపూండి టీజే గోవిందరాజన్(డీఎంకే), పొన్నేరి దురైచంద్రశేఖర్(కాంగ్రెస్), మాధవరం సుదర్శనం(డీఎంకే), వేళచ్చేరి అసన్ మౌలాన(కాంగ్రెస్), పూందమల్లి కృష్ణస్వామి(డీఎంకే) తదితరులను పరిచయం చేశారు. వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అద్యక్షుడు సెల్వపెరుందగై, పార్లమెంట్ సభ్యుడు శశికాంత్‌సెంథిల్, డీసీసీ అధ్యక్షుడు శశికుమార్, యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
వాగ్వాదం
రాహుల్ సభకు వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే పోలీసులు లోపలికి అనుమతించారు. అయితే తనీఖీలు మరీ ఆలస్యం కావడంతో పాటు ఎండలో చాలాసేపు నిలబడాల్సి రావడంతో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తామేమీ బాంబులతో రాలేదని, అయినా తనీఖీల పేరిట ఎందుకు ఎండలో నిలబెడుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం ఎంపీ శశికాంత్ సెంథిల్‌కు చేరడంతో మైక్ తీసుకుని రాహుల్‌గాంధీ వచ్చే సమయం అయ్యిందని, దయచేసి తనీఖీలను వేగంగా నిర్వహించి, క్లియర్ చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు జనాలను తనిఖీ చేయకుండానే వెనుక సీట్లకు పంపారు.
చాయ్.. అచ్చా భాయ్
పొన్నేరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వచ్చిన రాహుల్‌గాంధీకి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు వచ్చిన రాహుల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ముగియగానే వేదిక వద్ద ఏర్పాటు చేసిన రూమ్‌కు చేరుకుని కాస్త సేదదీరారు. ఈ సమయంలో రాహుల్‌కు జింజర్ టీని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ విభాగం నేత ఖలీల్ రహ్మాన్ అందించారు. మొదట వద్దన్న రాహుల్ తరువాత టీ తీసుకుని కాస్త రుచి చూసి ఛాయ్ అచ్చా ఖలీల్‌భాయ్ అంటూ భుజం తట్టి ముందుకు సాగారు.


