కొరుక్కుపేట: రాష్ట్ర ప్రజలు ప్రభు త్వ మార్పును ఆశిస్తున్నారని నటుడు ఎం.శరత్‌కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, నటుడు ఎం.శరత్‌కుమార్ అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా విరుదునగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ, తమిళనాడు కోసమే జరుగుతున్నాయని, డీఎంకే పాలనలో మాదకద్రవ్యాల సంస్కృతి పెరిగిందన్నారు. దీని కారణంగా బాలికల నుండి వృద్ధ మహిళల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తాము ప్రచారం చేస్తున్న అన్నిచోట్లా ప్రజల తిరుగుబాటును గమనిస్తున్నామన్నారు. ప్రతిచోటా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. తమిళనాడు ప్రజలు ప్రభుత్వ మార్పును ఆశిస్తున్నారని, డీఎంకే–బీజేపీ కూటమి బలమైనదని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని నిరసన వేదికగా మార్చి సానుభూతి తరంగాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యతో దక్షిణ రాష్ట్రాలు ప్రభావితమవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకువచ్చింది మోడీనేనన్నారు. కరోనా కాలంలో వ్యాక్సిన్లు అందించి, ప్రజలను కాపాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ప్రధానమంత్రి మోడీనే అని తెలిపారు. ఒక బిల్లును తీసుకువచ్చి, చర్చించకుండా తగలబెట్టడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. తాను 28 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, టీవీకే నాయకుడు విజయ్ గురించి మాట్లాడాలనుకోవడం లేదన్నారు. ముందు ఆయన తనను తాను నిరూపించుకోవాలని, రాజకీయాలకు కేవలం ముఖ సౌందర్యం మాత్రమే సరిపోదన్నారు. నటులు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ వారు క్షేత్రస్థాయిలో ఏమి చేస్తారనే దాని గురించే మనం మాట్లాడగలమని ఆయన మాట్లాడారు.


