మణప్పారైపై మంత్రుల దృష్టి | - | Sakshi
Sakshi News home page

మణప్పారైపై మంత్రుల దృష్టి

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

సాక్షి, చైన్నె: తిరుచ్చి మణప్పారై నియోజకవర్గంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న మనిదనేయ మక్కల్‌ కట్చి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే అబ్దుల్‌ సమద్‌పై సొంత పార్టీలోనే కాకుండా ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో డీఎంకేలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మంత్రులు కె.ఎన్‌.నెహ్రూ, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి రంగంలోకి దిగారు.

స్థానిక డీఎంకే నేతల అసంతృప్తి

మణప్పారై సీటును వరుసగా కూటమి పార్టీలకే కేటాయిస్తుండడంతో స్థానిక డీఎంకే నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమకు అవకాశం రాకపోవడంతో వారు ప్రచారంలో ఉత్సాహం చూపించకుండా వచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అబ్దుల్‌ సమద్‌ గత ఐదేళ్లలో తమ ప్రాంతాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ, ఆయన ప్రచారానికి వెళ్లిన చోటల్లా అడ్డుకునే పనిలో పడ్డారు. కొన్ని పంచాయతీలలో వివాదాల నేప థ్యంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

మంత్రుల బుజ్జగింపులు

పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన అబ్దుల్‌ సమద్‌.. జిల్లా మంత్రులు నెహ్రూ, అన్బిల్‌ మహేష్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక నేతలను శాంతింపజేస్తున్నారు. శనివారం ప్రచారంలో పాల్గొన్న మంత్రి నెహ్రూ మాట్లాడుతూ.. గతసారి లాగే ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా ఉండి అబ్దుల్‌ సమద్‌ను గెలిపించాలని కోరారు. అవకాశం రాని స్థానిక నేతలు గోవిందరాజన్‌, రామస్వామి, బాలసుబ్రమణి వంటి వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని బుజ్జగించారు. మంత్రుల ఆదేశాల మేరకు తాము అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని డీఎంకే కార్యకర్తలు చెబుతున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. మరోవైపు, మంత్రుల జోక్యంతో ప్రస్తుతం డీఎంకే శ్రేణులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాయని ఆ పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్తాఫ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement