రసవత్తర పోరు | - | Sakshi
Sakshi News home page

రసవత్తర పోరు

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

● అన్నాడీఎంకే అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి ● డీఎంకే అభ్యర్థిగా సత్య

హోసూరు..

● హోసూరు కార్పొరేషన్‌గా మారినా, పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి తగినంత మంది పోలీసులు లేరు.

● ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య నెలకొంది.

● రూ. 20 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ పువ్వుల ఎగుమతి కేంద్రం రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

● టమాటాలు, కూరగాయల నిల్వ కోసం కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

● బెంగళూరు–హోసూర్‌ మెట్రో రైలు ప్రాజెక్టు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల, ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఆధునీకరించాలనే విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

● హోసూరులో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం పనులకు పచ్చటి పంట పొలాలను స్వాఽధీనం చేసుకోకూడదన్న నినాదం మార్మోగుతోంది.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దుల్లోని హోసూరు బహు భాషల సమ్మేళనంతో నిండి ఉన్నా, ఇక్కడ తెలుగు ఓటరే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే ఇక్కడ అచ్చతెలుగు నాయకుడు బాలకృష్ణారెడ్డి అన్నాడీఎంకే అభ్యర్థిగా, తెలుగు సంతతికి చెందిన సత్య డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో టీవీకే అభ్యర్థిగా వేందర్‌ కరసన్‌ అలియాస్‌ వడివేలు, ఎన్‌టీకే అభ్యర్థిగా స్టాలిన్‌ పోటీలో ఉన్నారు.

సాక్షి, చైన్నె మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గం పరిసరాలు పారిశ్రామికంగా ప్రగతి పథంలో ఉన్నాయి. సుమారు మూడు వేలకు పైగా చిన్న, మధ్య తరహా, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వాచీలు, ద్విచక్ర , నాలుగు చక్రాల వాహనాల తయారీతో పాటు, ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి చల్లని వాతావరణం, సారవంతమైన భూములు వ్యవసాయానికి ఎంతో అనుకూలం. రోజా, ఇతర పువ్వులను ఇక్కడ అధికంగా సాగు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. చంద్రచూడేశ్వర స్వామి దేవాలయం, రాజాజీ జన్మస్థలమైన తొరపల్లి తదితర చారిత్రక ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ పరిధిలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ ఎక్కువే. తొమ్మిది సార్లు ఆ పార్టీ గెలిచింది. ఆ పార్టీకి చెందిన తెలుగు నాయకుడు గోపినాథ్‌ మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎంపీగా లోక్‌సభకు వెళ్లారు. ఇక్కడ తమిళం, కన్నడ, తెలుగు, ఉర్దూ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు.

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు 3,38,295 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,69,099, మహిళలు 1,69,124, ఇతరులు 72 మంది ఉన్నారు. ఇక, వన్నియర్లు (12%), షెడ్యూల్డ్‌ కులాలు (13%), నాయుడు (11%), గౌడ (10%) ఇతర వర్గాల వారు 54% మంది ఉన్నారు.

అభ్యర్థుల నేపథ్యం

కాంగ్రెస్‌ కంచుకోటను 2016లో అన్నాడీఎంకే అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి బద్దలు కొట్టారు. అదృష్టం కలిసి రావడంతో మంత్రి కూడా అయ్యారు. అదే సమయంలో దురదృష్టం కూడా ఆయన్న వెంటాడింది. ఎప్పుడో జరిగిన ఓ కేసులో ఆయనకు జైలు శిక్ష పడడంతో అనర్హత వేటు పడి, పదవిని కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఈ స్థానాన్ని డీఎంకే కై వసం చేసుకుని అప్పటి నుంచి తన గుప్పెట్లో పెట్టుకుంది.

తాజాగా తన గుప్పెట్లోకి నియోజకవర్గాన్ని తీసుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా బాలకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. తెలుగు ఓటర్ల మద్దతే కాదు, ఇతర సామాజిక వర్గాలు, కూటమి బలంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో ఈయన్ను ఢీ కొట్టే విధంగా బలమైన అభ్యర్థిని డీఎంకే నిలబెట్టింది. 2021లో ఇక్కడ గెలిచిన డీఎంకే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌కు ఈ సారి సీటు ఇవ్వలేదు. ఆయనకు బదులుగా గతంలో ఉప ఎన్నికలలో గెలిచిన, హోసూరు మేయర్‌గా ఉన్న సత్యను ఎంపిక చేశారు. ఈయన కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో సమరం రసవత్తరంగా మారింది. మేయర్‌గా ఆయనకు హోసూరు నగరం సుపరిచితం కావడంతో ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే) అభ్యర్థిగా స్టాలిన్‌, విజయ్‌ తమిళగ వెట్రి కళగం (టీవీకే) వేందర్‌ కరసన్‌ (అలియాస్‌) వడివేలు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన సమరం అన్నది డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే నెలకొంది.

ఇవీ సమస్యలు

Advertisement
 
Advertisement
Advertisement