ప్రచార హోరు | - | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

● ఆయా ప్రాంతాల్లో నేతల తిష్ట ● అభ్యర్థుల ఉరకల పరుగు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటోంది. ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రచార వేడి హోరా హోరీగా సాగుతోంది. కేవలం 3 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో (ఏప్రిల్‌ 21 సాయంత్రంతో ముగియనుంది), ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీల వ్యూహాలకు పదును పెట్టాయి.

అన్నాడీఎంకే కూటమి

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అన్నీ తానై నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలో ఉన్నారు. తమ గత పాలనలోని విజయాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మరిన్ని కొత్త పథకాలు తెస్తామని హామీ ఇస్తున్నారు. డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ఎండగట్టే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారు. ఈ కూటమిలోని అభ్యర్థులకు మద్దతుగా పలువురు కేంద్రమంత్రులు తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ప్రచార సభలో రోడ్‌ షోలకు ఏర్పాట్లు జరిగాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు.

ఒంటరి పోరు

విజయ్‌ (టీవీకే ), సీమాన్‌ ( ఎన్‌టీకే) అభ్యర్థుల కోసం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మార్పు కోరుకునే ఓటర్లే లక్ష్యంగా నటుడు విజయ్‌ ఓ వైపు సీమాన్‌ మరోవైపు వేర్వేరుగా తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అవినీతి రహిత పాలన కోసం తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మండుతున్న ఎండలో..

అన్ని పార్టీల అభ్యర్థులకు వేసవి కాలంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వీధి వీధినా ప్రచారం రథాలలో దూసుకెళ్తున్నారు. పగటిపూట ఎండలు మండుతుండడంతో, అభ్యర్థులు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఉదయం 5 గంటలకే ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. ఓపెన్‌ టాప్‌ వ్యాన్లలో అభ్యర్థులు నిలబడి అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మధ్యాహ్నం కాస్త విరామం ఇచ్చి సాయంత్రం 4 గంటల తర్వాత అసలైన ప్రచార దూసుకెళ్తున్నారు. డప్పుల మోత, పార్టీ నినాద పాటల ఆలాపనతో వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. ప్రచార ప్రదేశాలలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, తమ చిహ్నాలను (గుర్తులను) ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. 21వ తేదీన ప్రచారం ముగియనుండడంతో సుడిగాలి పర్యటనలో దూసుకెళ్లే పనిలో అభ్యర్థులు ఉన్నారు. శుక్రవారం అన్నీ మసీదుల వద్ద అభ్యర్థులు, వారి పార్టీల మద్దతుదారులు బారులు తీరి ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. వినూత్న రీతిలో ప్రచారాలు సైతం హోరెతుత్తున్నాయి.

ఇక రాష్ట్రంలో 90 చోట్ల పోటీలో ఉన్న బీఎస్పీ అభ్యర్థుల సైతం తమదైన శైలిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.

ఓటర్ల సమస్యను వింటున్న డీఎంకే అభ్యర్థి స్పీకర్‌ అప్పావు

ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం వంటిదని పేర్కొంటున్నారు. కేంద్రంలోని బీజేపీ, ప్రధాన ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఉదయం వాకింగ్‌ రూపంలో ఓట్ల వేట, సాయంత్రం ప్రచార సభలతో స్టాలిన్‌ ముందుకెళ్తున్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం, యువజన నేత ఉదయనిధి స్టాలిన్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంలో రాష్ట్ర పర్యటనలో దూసుకెళ్తూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని టార్గెట్‌ చేస్తున్నారు. నియోజకవర్గాలలోని గ్రామాలను కలిపే విధంగా డీఎంకే ఎంపీ, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి కరుణానిధి ప్రచారంలో ఉన్నారు. తాజాగా పార్లమెంట్‌ సమావేశాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు.

డీఎంకే కూటమి

Advertisement
 
Advertisement
Advertisement