నమ్మలేని నలుపు చట్టం | - | Sakshi
Sakshi News home page

నమ్మలేని నలుపు చట్టం

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

● డీలిమిటేషన్‌పై స్టాలిన్‌ ఫైర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తక్షణమే పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. డీఎంకే నేతృత్వంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో శుక్రవారం ఈ అంశంపై సీఎం స్టాలిన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

ఇది నమ్మలేని నలుపు చట్టం

నియోజకవర్గాల పునర్విభజనతో తమిళనాడులోని సీట్ల సంఖ్య తగ్గదని పార్లమెంటులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారు చెబుతున్న మాటలకు, వారు ప్రవేశపెట్టిన బిల్లుకు అస్సలు పొంతన లేదని స్టాలిన్‌ విమర్శించారు. వీరి మాట ఒకటి, చేసే పని మరొకటి అని పేర్కొన్నారు. ఈ మోసపూరిత హామీని అస్సలు నమ్మబోమని స్పష్టం చేశారు. ఇది ఒక నమ్మలేని నలుపు చట్టం అని ధ్వజమెత్తారు.

భవిష్యత్తులో పెనుముప్పు

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌కు అపరిమితమైన అధికారాలు ఇచ్చారని స్టాలిన్‌ ఆరోపించారు. దీనివలన కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలమైన సమయంలో, అనుకూలమైన రీతిలో రాష్ట్రాల నియోజకవర్గాల పరిధిని మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర అని ఆయన అభివర్ణించారు.

చట్టపరమైన రక్షణ కావాలి

గతంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్‌ బిహారీ వాజపేయి రాజ్యాంగ సవరణలు చేసి, నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల పాటు నిలిపివేసిన విషయాన్ని స్టాలిన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం నోటి మాటలు కాకుండా, రాజ్యాంగబద్దమైన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేంద్రానికి హెచ్చరిక

సంఖ్యా బలం ఉంది కదా అనే అహంకారంతో తమ వ్యతిరేకతను కాదని ఈ బిల్లును ఆమోదిస్తే, దాని పర్యావసానాలను తమిళనాడులో ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఈ పునర్విభజన అంశం తమిళనాడులో సెంటిమెంట్‌ అస్త్రంగా ఎన్నికల వేళ మారింది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు, నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న భయం ప్రజల్లో నెలకొన్నట్టైంది. దీనిని డీఎంకే ప్రచార అస్త్రంగా వాడుకుంటుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement