సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం అధికార డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సేలం జిల్లాలోని శంకగిరి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు తమిళనాడును దోచుకుంటున్న కుటుంబానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వ్యాఖ్యానించారు.
కుటుంబ పాలనపై దాడి
ఈ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరాటం కాదని, తమిళనాడును దోచుకుంటున్న స్టాలిన్ కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అభివర్ణించారు. స్టాలిన్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీఎంకే హయాంలో తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సామాజిక, ఆర్థిక హామీలు
కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా తమిళనాడులో కూడా కుల గణన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం రేషన్ షాపుల్లో నాణ్యత లేని బియ్యం ఇస్తున్నారని, అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. చేనేత, పవర్‌లూమ్ కార్మికులు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. తమ హయాంలో అమలు చేసిన పథకాలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తనపై ఉన్న కోపంతో తాను తీసుకొచ్చిన మంచి పథకాలను డీఎంకే ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. డీఎంకే ఇచ్చిన హామీలలో కనీసం నాలుగో వంతు కూడా నెరవేర్చలేదని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.


