వైద్య వృత్తిలో విలువలకు కట్టుబడండి | - | Sakshi
Sakshi News home page

వైద్య వృత్తిలో విలువలకు కట్టుబడండి

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

సాక్షి,చైన్నె: వైద్య వృత్తిలో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని జాతీయ వైద్య కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అభిజత్‌ చంద్రకాంత్‌ ఉద్భోదించారు. దేశానికి సమర్థులే కాకుండా కరుణ, సామాజిక బాధ్యత కలిగిన వైద్యులు అవసరమని నొక్కి చెప్పారు.శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (శ్రీహెర్‌) 41వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంద్రకాంత్‌ ప్రతిభావంతులైన విద్యార్థులకు 53 బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఎంబీబీఎస్‌ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ చాటిన డాక్టర్‌ జానవి శ్రీధర్‌ మూడు బంగారు పతకాలను అందుకున్నారు. డాక్టర్‌ అభిజత్‌ మాట్లాడుతూ, రోగుల బాధలను వైద్యులు సానుకూల దృక్పథంలో ఆలకించాలన్నారు. ప్రో–ఛాన్సలర్‌ ఆర్వీ సెంగూటువన్‌ వైద్య, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాలలో పీహెచ్‌డీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతో సహా 902 మంది పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు. వార్షిక నివేదికను వైస్‌–ఛాన్సలర్‌ డాక్టర్‌ ఉమా శేఖర్‌ నివేదించారు. శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్‌–హెల్త్‌ ట్రస్ట్‌ ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ మహేష్‌ వాకముడి, మెడికల్‌ కాలేజ్‌ డీన్‌ కె. బాలాజీ సింగ్‌, రిజిస్ట్రార్‌ సెంథిల్‌ కుమార్‌, డీన్‌ రీసెర్చ్‌ వెంకటాచలం, పరీక్షల నియంత్రణాధికారి పద్మావతి, డైరెక్టర్‌, ఫైనాన్స్‌–అకౌంట్స్‌ రవిశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement