జననాయకన్‌ చిత్రం ఎలా లీక్‌ అయ్యిందంటే..? | - | Sakshi
Sakshi News home page

జననాయకన్‌ చిత్రం ఎలా లీక్‌ అయ్యిందంటే..?

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

తమిళసినిమా: నటుడు, వీటీకే పార్టీ అద్యక్షుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జననాయకన్‌. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితబైజు, బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత జన వరి 9వ తేదీ విడుదల కావలసి ఉన్నా, సెన్సార్‌ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 11న చిత్రం మొత్తం ఇంటర్నెట్‌లో లీక్‌ అయ్యి యావత్‌ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీంతో దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేయడంతో చైన్నె సైబర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఆరుగురిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. తాజాగా మరో ముఖ్యులైన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వీరిని విచారణ చేయడంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జననాయకన్‌ చిత్రాన్ని ఎడిటింగ్‌ చేసిన చైన్నెలోని ఒక స్టూడియో నుంచే చిత్రం లీక్‌ అయ్యిందని తెలిసింది. చిత్రం కొంత భాగం ఎడిటింగ్‌ బాధ్యతలను ఒక సహాయ ఎడిటర్‌కు అప్పగించడంతో అతనే చిత్రాన్ని పూర్తిగా రికార్డ్‌ చేసి ఒక నిర్మాతకు ఇచ్చాడని, ఆ నిర్మాత జననాయకన్‌ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో లీక్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జైలర్‌ 2 చిత్రంలో రజనీకాంత్‌

తమిళసినిమా: ఇటీవల చిత్రాలు విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అవడం పరిపాటిగా మారి నిర్మాతలకు ఇదో సమస్యగా మారింది.. ఇటీవల నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన జననాయకన్‌ చిత్రం పూర్తిగా ఇంటర్నెట్‌లో లీక్‌ కావడం యావత్‌ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. దీనిపై సైబర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్‌–2 చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలతో కూడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్‌ అయ్యి వైరల్‌ అవుతోంది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియోను నిలువరించడానికి తాము ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని ప్రకటించింది. అంతేకాకుండా లీక్‌ అయిన ఆ వీడియోను ఇతర వెబ్‌సైట్లలో ప్రసారం చేయడంగానీ, ఇతరులకు పంపడం గానీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాము తీసుకునే చర్యలకు చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి బాధ్యత వహించదదని సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement