పురాణాల నేపథ్యంలో భగవాన్‌ | - | Sakshi
Sakshi News home page

పురాణాల నేపథ్యంలో భగవాన్‌

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

తమిళసినిమా: నటుడు ఆరిఅర్జునన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవాన్‌. నటి పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో జేమ్స్‌ బారెట్‌, సంతోష్‌ ప్రతాప్‌, ఆడుగళం నరేన్‌, ఢిల్లీ నారాయణన్‌, అలెక్స్‌, అభిషేక్‌, సత్య, మాస్టర్‌ పాండి, అజయ్‌ తాతా, జగధీశ్‌ జీవీ.కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమ్మన్యా మూవీస్‌ పతాకంపై జీవీ మంజునాథ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.కాళింగన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ.. ఈ ప్రపంచంలో మనకు అర్థం కాని పలు విషయాలు ఉన్నాయని, వాటిలో ఎన్నో రహస్యాలు ఉంటాయన్నారు. మనం అంతా భగవంతుడిని పూజిస్తామనీ, ఈ లోకాన్ని ఏలేది భగవంతుడు అయితే ఆయన ఎవరు, ఆయన ఒక రూపం మాత్రమేనా, లేక వేరేదా? అలాగైతే ఇలుమ్నాటి ఎవరు? ఇలాంటి పలు ప్రశ్నలకు బదులే ఈ చిత్రానికి కేంద్రబిందువు అని అన్నారు. మనకు తెలియని ప్రాచీన చరిత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని పౌరాణిక థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. భగవాన్‌ ఒక సాధారణ కథా చిత్రం కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేదిగా ఉంటుందని అన్నారు. మహాభారతంలోని కొంత భాగం కూడా ఇందులో ఉంటుందని తెలిపారు. ఒక సాధారణ జీవిగా చూసే బల్లిని ఇందులో ఒక ముఖ్య పాత్రగా చూపించినట్లు చెప్పారు. ఒక కొత్త ఆలోచనతో విభిన్న కథాంఽశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. దీనికి మురు గన్‌ శరవణన్‌ ఛాయాగ్రహణంను, సంగీతాన్ని ప్రసన్‌ బాల, నేపథ్య సంగీతాన్ని యువరాజ్‌ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా సెవెంత్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేత కన్నన్‌ విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement