సాక్షి, చైన్నె: హిందుస్థాన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆధ్వర్యంలో హార్మొనీ ఫర్ హోప్–2026 పేరుతో సంగీత విభావరి చైన్నెలో ఘనంగా జరిగింది. అంతర్జాతీ య ప్రఖ్యాత కీబోర్డ్ మాంత్రికుడు స్టీఫెన్ దేవస్సీ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సంగీతం ద్వారా ప్రపంచ శాంతిని, సామరస్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గిండి, కరపాక్కం, పదూర్, పడపాయ్ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు,టీచర్లు పాల్గొన్నారు. హిందుస్థాన్ బ్యాండ్ బిలీవర్, ఛాన్స్ ఇల్లా చైన్నె, రాక్ ఆన్ తదితర పాటలతో ఉత్సాహాన్ని నింపారు. సూపర్ సింగర్ ఫేమ్ మాస్టర్ ఆర్.పి.క్రిషాంగ్ ‘పాపా మేరే జాన్’, ‘రథమారే’ తదితర హిట్ సాంగ్స్‌తో అలరించారు. సంగీతం ద్వారా స్ఫూర్తిని నింపుతున్న స్టీఫెన్ దేవస్సీకి హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మేనేజ్‌మెంట్ తరఫున చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ ‘మెసెంజర్ ఆఫ్ పీస్’(శాంతి దూత) బిరుదును ప్రదానం చేసి మాట్లాడారు. కళలు, సంస్కృతితో సామాజిక బాధ్యతను పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
తిరువళ్లూరు: శిరువాపురిలోని బాలసుబ్రమణ్య స్వామివారి ఆలయంలో గత నెలన్నర రోజుల్లో 83.82 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్‌లోని శిరువాపురి ఆలయంలో ప్రసిద్ధి చెందిన శ్రీబాలసుబ్రమణ్య స్వామివారి ఆలయం ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో గత 50 రోజుల్లో 83.82 లక్షల రూపాయల నగదుతో పాటు 51.300 మిల్లీగ్రాముల బంగారం, 4323 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.


