కొరుక్కుపేట: భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒమేగాబాల్ క్రీడను ఐఐటీ మద్రాస్ పరిచయం చేసింది. ఒమేగాబాల్ అనేది ఫుట్‌బాల్ లాగా వేగవంతమైన, వినూత్నమైన ఒక రకం. దీనిని మూడు గోల్స్‌తో వృత్తాకార మైదానంలో మూడు జట్లు ఆడతాయి. ఇందులో ప్రతి జట్టు ఒక గోల్‌ను కాపాడుకుంటూనే ఏకకాలంలో రెండు గోల్స్‌పై దాడి చేయవచ్చని ఐఐటీ మద్రాసు ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ప్రారంభోత్సవానికి గుర్తుగా ఇన్‌స్టిట్యూట్ జింఖానా, డీన్ (విద్యార్థులు) కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం క్యాంపస్ ఫుట్‌బాల్ మైదానంలో అంతర్ కళాశాల ఒమేగాబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. ఈ టోర్నమెంట్‌లో ఐఐటీ మద్రాస్ ఆరెంజ్, బ్లూ జట్లతో పాటు, లయోలా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గురునానక్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ, ది న్యూ కాలేజ్, నజరేత్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, సవిత యూనివర్సిటీ, వైఎంసీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి చైన్నెలోని ప్రముఖ సంస్థల జట్లు పాల్గొన్నాయి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ఒమేగాబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ డీన్ (స్టూడెంట్స్) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్.గుమ్మడి, ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ అడ్వైజర్ ప్రొఫెసర్ శృతి దుబే, ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కో–అడ్వైజర్ ప్రొఫెసర్ సుధాకరన్ చంద్రన్, అధ్యాపకులు, విద్యార్థులు, నగరవ్యాప్తంగా ఉన్న కళాశాలల జట్లు హాజరయ్యాయి. దేశంలో క్రీడల ఆధారిత ప్రవేశాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఐఐటీ మద్రాస్ అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తెలిపారు. ఒమేగా బాల్ అనేది ఐఐటీ మద్రాస్ ప్రతిపాదించే నూతన ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు .


