బరిలో హేమాహేమీలు | - | Sakshi
Sakshi News home page

బరిలో హేమాహేమీలు

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

నాలుగోసారి కొళత్తూరులో స్టాలిన్‌

ఎడప్పాడిలో ఆరోసారి పళణి

తొలిసారిగా పోటీలో విజయ్‌, సీమాన్‌

ఒక్క ఛాన్స్‌ కోసం ఇద్దరు బీజేపీ నేతల విశ్వ ప్రయత్నం

మిళనాడులోని 234 స్థానాలలో కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు పోగా 164 స్థానాలలో డీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిత్రులలో మరో 11 మంది డీఎంకే ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ 175 స్థానాలలో పోటీ చేసినట్టైంది. 164 మందితో కూడిన డీఎంకే అభ్యర్థులలో 125 మంది పట్టభద్రులు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్లు 7 మంది, డాక్టర్లు 15 మంది, ఇంజినీర్లు 17 మంది, న్యాయవాదులు 29 మంది ఉన్నారు. అలాగే 18 మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. కొత్తగా 60 మందికి ఈ సారి స్టాలిన్‌ అవకాశం కల్పించారు. సిట్టింగ్‌లలో అనేక మందిని పక్కన పెట్టారు. ఇక మూడుసార్లు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం పన్నీరుసెల్వంకు తేని జిల్లా బోడినాయకనూరు నియోజకవర్గాన్ని స్టాలిన్‌ కేటాయించారు. ఆయన్ను నమ్ముకుని అన్నాడీఎంకే నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌లకు వారి సిట్టింగ్‌ స్థానాల్లోనే అవకాశం కల్పించారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ చైన్నెలోని కొళత్తూరు నియోజవర్గం నాలుగో సారిగా పోటీ చేస్తున్నారు. ఆయన తనయుడు, డీఎంకే యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ రెండో సారిగా చేపాక్కం–ట్రిప్లికేన్‌ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక డీఎంకే ప్రధాన కార్యదర్శి , సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ వేలూరు జిల్లా కాట్పాడిలో ఏడోసారిగా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, మరో సీనియర్‌ మంత్రి కేఎన్‌ నెహ్రు తిరుచ్చి వెస్ట్‌ నుంచి హ్యాట్రిక్‌ కోసం మళ్లీ పోటీలో దిగారు. కేబినెట్‌లోని 33 మందిలో ముగ్గురిని పక్కన పెట్టారు. మిగిలిన వారందరూ వారివారి సిట్టింగ్‌ సీట్లలో పోటీ చేస్తున్నారు. వీరిలో అనిత రాధాకృష్ణన్‌, గీతాజీవన్‌, కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, తంగం తెన్నరసు, ఎస్‌.రఘుపతి, కేఆర్‌ పెరియకరుప్పన్‌, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, స్వామినాథన్‌, శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణియన్‌, ఐ.పెరియస్వామి, ముత్తుస్వామి తదితర సీనియర్లు ఉన్నారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు మళ్లీ వారివారి సిట్టింగ్‌ స్థానాలలో పోటీలో ఉన్నారు. అయితే, చివరి క్షణంలో వ్యూహాత్మకంగా రాణిపేట నియోజకవర్గం అభ్యర్థిగా సీటు తిరస్కరించబడ్డ మంత్రి గాంధీ పోటీ చేయక తప్పలేదు. ఇందుకు కారణం నామినేషన్‌ చివరి రోజున ఎన్నికల నుంచి ఆయన తనయుడు వినోద్‌గాంధీ తప్పుకోవడమే. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా త్యాగ భూమి శ్రీపెరంబదూరులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పోటీలో ఉన్నారు.

ఒక్క ఛాన్స్‌

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తాజాగా అన్నాడీఎంకే కూటమిలోని ఇద్దరు బీజేపీ నేతలపై అందరి దృష్టి పడింది. ఇందులో ఒకరు మాజీ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌. మరొకరు కేంద్ర సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌. తమిళిసై సౌందరరాజన్‌ ఆమె తమిళనాడుకే కాదు, తెలంగాణ, పుదుచ్చేరికి సైతం సుపరిచితురాలే. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా సైతం సేవలు అందించారు. అయితే ఆమె ఆకాంక్ష అంతా ఒక్క సారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నదే. అందుకే 2006,2011 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికలలో సైతం పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. చివరకు ఆమెకు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏక కాలం పనిచేసే అవకాశం దక్కినా, 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలని ఆ పదవికి రాజీనామా చేసినా అదృష్టం కలిసి రాలేదు. చివరకు చైన్నె మైలాపూర్‌ అసెంబ్లీ నుంచి ఒక్క ఛాన్స్‌ కోసం విస్తృతంగా ఓట్ల వేటలో ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ 2021లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా తిరుపూర్‌ జిల్లా తారాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తదుపరి ఆయనకు మంత్రి పదవి దక్కినా, ప్రత్యక్ష ఎన్నికలలో గెలవాలన్న తపన వీడలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలలో నీలగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన తాజాగా తిరుపూర్‌ జిల్లా అవినాశి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ అయితే తన స్వస్థలం తిరునల్వేలిని పక్కన పెట్టి, ఈసారి పొరుగు జిల్లా విరుదునగర్‌లోని సాత్తూరును ఎంపిక చేసుకుని పోటీలో ఉన్నారు.

విజయ్‌(టీవీకే)

పళనిస్వామి(అన్నాడీఎంకే)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు పోటీలో ఉన్నారు. ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే), అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే)లలో సీనియర్‌ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఎందరో పోటీలో ఉన్నారు. ఉద్దండులంతా తమ ఎన్నికల జాతకాన్ని పరీక్షించుకోనున్నారు. – సాక్షి, చైన్నె

Advertisement
 
Advertisement
Advertisement