సాక్షి, చైన్నె: తమిళనాడు ఎన్నికల వేళ అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా భారీ మొత్తంలో ఎరచ్రందనం దుంగలతోపాటు కోట్ల విలువైన నగదు, బంగారం పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఎరచ్రందనం స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
చెంగల్పట్టు– విక్రవాండి సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎరచ్రందనం దుంగలు పట్టుబడ్డాయి. చెంగల్పట్టు నుంచి విల్లుపురం మీదుగా తేని వైపు వెళ్తున్న ట్రక్కులను పోలీసులు తనిఖీ చేయగా, సిమెంట్ బస్తాల కింద దాచి ఉంచిన ఎరచ్రందనం బయటపడింది. ఈ ఎరచ్రందనం దుంగల విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదే తనిఖీల్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో రహస్యంగా దాచి తరలిస్తున్న బంగారాన్ని కూడా అధికారులు గుర్తించారు. వీటిపై ఎన్నికల ఫ్లయింగ్‌స్క్వాడ్, అటవీ, పోలీసు శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
రూ.900 కోట్లు స్వాధీనం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 900 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం రూ.446.28 కోట్లు పట్టుబడగా, ఈసారి ఆ సంఖ్య ఇప్పటికే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. సరైన ఆధారాలు చూపిన వారికి రూ.400 కోట్ల విలువైన వస్తువులను తిరిగి ఇచ్చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
అరప్పోర్ ఇయక్కం విమర్శలు
ఈ భారీ స్వాధీనాలపై సామాజిక సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ నగదు, వస్తువులపై నమోదు చేస్తున్న ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆరోపిస్తున్నారు.


