– మసీదులో డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తినాయుడు ప్రచారం
తిరుత్తణి: మతవాద బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే కూటమికి మైనార్టీ ప్రజలు బుద్ధి చెప్పాలని, డీఎంకే కూటమిని గెలిపించి మళ్లీ సీఎంగా స్టాలిన్‌ను గెలిపించాలని తిరుత్తణి నియోజకవర్గ డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తినాయుడు పిలుపునిచ్చారు. తిరుత్తణి నియోజకవర్గంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తినాయుడు పోటీ చేస్తున్నారు. అతను డీఎంకే కూటమి పార్టీల కార్యకర్తలతో కలిసి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం వాకింగ్ చేసి ప్రచారం చేశారు.అనంతరం పట్టణంలోని దుకాణాలు, వ్యాపారులను కలుసుకుని ప్రచారం చేశారు. రైలు, బస్సు ప్రయాణికులను కలుసుకుని ఢమరుకం గుర్తుకు ఓట్లు అభ్యర్థించారు. మధ్యాహ్నం జుమ్మా మసీదుకి వెళ్లి ముస్లింలను కలుసుకుని ఓట్లు అడిగారు. మత సిద్ధాంతాలు నిండిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేకు గుణపాఠం చెప్పాలని, తనను గెలిపించి డీఎంకేను అధికారంలోకి తేవాలని కోరారు. జిల్లా డీఎంకే కార్యదర్శి చంద్రన్, మాజీ కార్యదర్శి భూపతి సహా అనేక మంది పాల్గొన్నారు.


