చైన్నె బీచ్‌లో జెల్లీఫిష్‌లు
కొరుక్కుపేట: పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా చైన్నె బీచ్‌లలో జెల్లీఫిష్‌లు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి. జెల్లీఫిష్‌లు, అరుదైన ఎర్ర సముద్ర తాబేళ్లతో సహా అనేక సముద్ర జీవులు చైన్నె సహా సముద్ర ప్రాంతాలలో నివసిస్తాయి. వీటిలో, జెల్లీఫిష్‌లు సముద్ర చేపలలో అత్యంత అందమైనవి, ఉత్తేజకరమైనవి. విశాలమైన నీటి ఉపరితలం ఉన్న లోతైన సముద్ర ప్రాంతాలలో ఇవి సమృద్ధిగా నివసిస్తాయి. కాలుష్య వైవిధ్యం కారణంగా, ఇవి ఎక్కువగా చైన్నె తీరప్రాంతంలో ఉన్నాయి. వారం రోజులుగా జెల్లీఫిష్‌ల సంచారం అసాధారణంగా పెరిగిందని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. దీనివల్ల చైన్నె , ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల నివాసితులకు అనేక సమస్యలు తలెత్తాయి. సముద్రంలో స్నానం చేయడానికి వచ్చే చాలా మంది పర్యాటకులను తేళ్లలాంటి జెల్లీఫిష్‌లు కుడుతున్నాయి, దీనివల్ల వారికి తీవ్రమైన నొప్పి, దురద, దద్దుర్లు వస్తున్నాయని చెబుతున్నారు. గాలి వేగంలో మార్పు కారణంగా, ప్రస్తుతం తీరంలో సమృద్ధిగా ఉన్న జెల్లీఫిష్‌లు పడవల్లోని జాలర్ల వలల్లో చిక్కుకుంటున్నాయి. వీటిని తాకిన వారికి ఒళ్లంతా దురద, ఛాతి నొప్పి, చేతులు, కాళ్ల నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. వేసవిలో వేడి పెరిగి, సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఇలాంటి జెల్లీఫిష్ సమూహాలు తరచూ కనిపిస్తాయని జాలర్లు అంటున్నారు.
పులి దాడిలో మహిళ మృతి
అన్నానగర్: పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది. నీలగిరి జిల్లాలోని అనుమాపురానికి చెందిన పార్వతి (55). గత 11వ తేదీ రాత్రి బంధువును కలిసేందుకు వెళుతుండగా అదృశ్యమైంది. అటవీ శాఖ, పోలీసులు ముమ్మరంగా గాలించారు. నాలుగు రోజుల తర్వాత, బుధవారం దట్టమైన అటవీ ప్రాంతంలో ఆమె శరీర భాగాలు లభ్యమయ్యాయి. తేయాకు తోటలో ఉన్న పులి ఆమైపె దాడి చేసి 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లిందని విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దివ్యాంగుడు దారుణ హత్య
అన్నానగర్: రాయితో కొట్టి దివ్యాంగుడిని దుండుగుడు హత్య చేశాడు. చైన్నెలోని సైదాపేట ప్రాంతానికి చెందిన మురుగన్ (40). దివ్యాంగుడైన ఇతను సైదాపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డుపై నివసించేవాడు. గురువారం, రైల్వేస్టేషన్ సమీపంలోని రోడ్డు పై మురుగన్ రక్తపు గాయాలతో శవంగా పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసి సైదాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో, మురుగన్ నివసించే అదే వీధికి చెందిన నారాయణన్ (50) అనే వ్యక్తి అతడిని కొట్టి హత్య చేసినట్లు తెలిసింది. మద్యం మత్తులో జరిగిన వాగ్వాదంలోనే మురుగన్‌ను కొట్టి చంపినట్లు తెలిసింది. పోలీసులు నారాయణన్‌ను అరెస్టు చేశారు.
గణనాథుని సన్నిధిలో అపోలో చైర్మన్
కాణిపాకం: అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ వారు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల : తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.


