వేలూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి నియంతృత్యంగా వ్యవహరిస్తోందని మంత్రి, డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ నియోజక వర్గాల పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీతో పాటు కూటమి పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇంటిపై నల్ల జెండాలు కట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అందులో బాగంగా కాట్పాడి గాంధీనగర్‌లోని మంత్రి దురైమురుగన్ ఇంటి ముందు నల్ల జెండాను కట్టి నిరసనలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ పూర్తిగా బీజేపి ఉచ్చులో చిక్కుగా ఉందన్నారు. బీజేపీ నియోజక వర్గాల పునర్విభజనను ఎన్నికల సమయంలో తీసుకు రావడం సరికాదన్నారు. ప్రజా అభిప్రాయం సేకరించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. ఒక రాష్ట్రం మద్దతు లేకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు పలు పథకాలను అమలు చేస్తూ పూర్తిగా ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం నడిపించాలని చూస్తోందన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తమ కూటమి పార్టీలకు చెందిన ప్రతినిధులు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్నామన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు టీటా శరవణన్, డివిజన్‌న్ కార్యదర్శి పరమశివం, డీఎంకే శ్రేణులు పాల్గొన్నారు.


