తిరువళ్లూరు: నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని అమలు చేయడం ద్వారా తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ డీఎంకే అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు తిరువళ్లూరులో నల్లబ్యాడ్జీలు ధరించి డీఎంకే శ్రేణులు నిరసన తెలిపారు. జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కేంఽద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయడం వల్ల రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే ప్రమాదం వుందని, తద్వారా పార్లమెంట్‌లో తమిళనాడుకు ప్రాతినిత్యం తగ్గుతుందన్నది డీఎంకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన వద్దని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆందోళనలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.
ప్రతి ఇంటిపై నల్లా జెండాలు ఎగరవేయడంతో పాటు నల్లదుస్తులు ధరించి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో డీఎంకే ఆధ్వర్యంలో పట్టణంలోని డీఎంకే కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరులో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరై ప్రసంగించారు. డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, డీఎండీకే, వీసీకే శ్రేణులు పాల్గొన్నారు.


