–నలుగురి అరెస్ట్
తిరువళ్లూరు: సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతున్న విద్యార్థిని గదిలోకి చొరబడి విచక్షనా రహితంగా కత్తులతో దాడి చేసిన వ్యవహారంలో నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని వల్లూరు వాలాజ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆస్కార్. ఇతని భార్య సల్మా. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. వీరిలో మొదటి కుమార్తె సుమయాఫాతీమా(18) స్థానికంగా వున్న ప్రయివేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో సెమిస్టర్ పరిక్షలు ప్రారంభం కానున్న క్రమంలో ఇంట్లో చదువుకుంటున్న ఫాతిమాపై నలుగురు యువకులు చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణ అనంతరం మిగిలిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు గంజాయి మత్తులో యువతిపై దాడి చేసినట్టు నిర్ధారించారు. అనంతరం పట్టుబడిన దేవన్ కుమారుడు ఢిల్లీబాబు(23), లోకేష్(22), తమిళరసు కుమారుడు ముత్తమిళ్‌సెల్వన్(24), అబ్దుల్‌సలాం కుమారుడు సిద్ధిక్(19)గా గుర్తించారు. వీరు అదే ప్రాంతంలో కత్తులతో హల్‌చల్ చేసి రీల్స్ చేయడం, స్థానికులను బెదిరింపులకు దిగడం లాంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


