నేటి నుంచి వేసవి సెలవులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వేసవి సెలవులు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

● సెలవుల్ని ప్రయోజనకరంగా మార్చుకోండి ● విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ సూచన

సాక్షి, చైన్నె: వేసవి సెలవుల కాలాన్ని విద్యార్థులు అర్థవంతంగా, ప్రయోజనకరంగా గడపాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. తిరిగి జూన్‌ 1వ తేదీన పాఠశాలలు పునర్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల భద్రత , ఆరోగ్యం దృష్ట్యా తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఎస్‌. కన్నప్పన్‌ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

ముఖ్యమైన సూచనలు

సెలవు రోజుల్లో సముద్రం, నదులు, సరస్సులు, చెరు వులు, కుంటల వద్దకు విద్యార్థులను స్నానానికి వెళ్లనివ్వవద్దని కోరారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీరు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం లేదా ఆరుబయట ఆటలు ఆడటం నివారించాలని సూచించారు. సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా చూడాలని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేయడం , సంగీతం వినడం వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా వారిని ఉత్సాహంగా ఉంచాలని వివరించారు. టీవీలు , సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని, విద్యార్థుల ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరం అని పేర్కొంటూ, వారికి సంప్రదాయ ఆహార పదార్థాలను మరియు వేసవికి తగిన పండ్లను అందించాలన్నారు.

పఠన ఆసక్తిని పెంచుదాం

విద్యార్థులను దగ్గరలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు తీసుకెళ్లి, రోజుకు కనీసం ఒక గంట సేపైనా పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలని, వారి ఆసక్తిని బట్టి కామిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌, నీతి కథల పుస్తకాలను అందించాలని వివరించారు. అలాగే నైపుణ్యాల అభివృద్ధి దిశగా సంగీతం, నృత్యం, పెయింటింగ్‌ వంటి రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సెలవుల్లో వాటిని నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతిరోజూ రెండుసార్లు పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వంటి అలవాట్లను పెంపొందించాలని, పెద్దలను గౌరవించడం, వారికి సహాయం చేయడం వంటి విలువలను నేర్పించాలని కోరారు. పిల్లల వేసవి సెలవుల ప్రణాళికలో ఇవి తప్పకుండా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement