తమిళసినిమా: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సినీ అవకాశాలకు మంచి వేదికగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హౌస్ నుంచి వచ్చిన పలువురు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.కాగా తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్ట్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన పేరు విక్కల్స్ విక్రమ్. ఈయన ఇంతకు ముందే స్టార్టప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది తాజాగా లైట్ వెయిట్ బేబీ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఫిట్నెస్ మోడలింగ్ ఆర్తి కృష్ణ నాయకిగా పరిచయం అవుతున్నారు. దీనికి కేసీ గురు కథ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హితా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ సంతోష్.జీ, తిమ్మా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ప్రమోద్ కొడియన్ ఛాయాగ్రహణంను, శరవణన్ సుబ్రమణియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్రహోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోగా పరిచయం అవుతున్న నటుడు విక్కల్స్ విక్రమ్ మాట్లాడుతూ తాను స్టార్టప్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహిస్తుండగా బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. ఆ గేమ్‌షోలో చివరి వరకూ చేరుకునే విధంగా అభిమానులు ఆదరించారన్నారు. ఆ తరువాత లైట్ వెయిట్ బేబీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. తాను నటుడిగా పరిచయం అయిన 10 ఏళ్లకు హీరోగా నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. ఈ చిత్ర టైటిల్ సోస్టర్ చూస్తేనే ఇది వినోదభరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని అర్దం అయ్యిపోతుందన్నారు. చిత్ర దర్శకుడు కేసీ.గురు చిత్ర వివరాలను తెలుపుతూ ఈ నెల 24వ తేదీ నుంచి షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. లైట్ వెయిట్ బేబీ అనేది ఇన్‌బ్యాలెన్ లైఫ్ అని చెబుతుందన్నారు. చిత్ర టైటిల్‌లో వెయిట్ లిఫ్ట్‌లో ఒక పక్క బరువు తక్కువగా, మరో పక్క బరువు ఎక్కువగా ఉన్నట్లే ఈ చిత్ర కథ ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞలు అని ,ఈ చిత్రం ఎలా వస్తుందో నని ఆసక్తిగా ఉందని నటి ఆర్తికృష్ణ పేర్కొన్నారు.


