లోక్‌సభ నియోజకవర్గాలపునర్ వ్యవస్థీకరణపై తీవ్ర ఆగ్రహం
బిల్లు నకలు పత్రాలు దగ్ధం
నల్ల చొక్కాలతో డీఎంకే వర్గాల నిరసన
వాడవాడలా నల్ల జెండాల ప్రదర్శన
బిల్లుకు వ్యతిరేకంగా
బిల్లు ప్రతిని తగలబెడుతూ నినదిస్తున్న స్టాలిన్
సాక్షి, చైన్నె : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో లోక్ సభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని ఆది నుంచి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గురువారం డీఎంకే వర్గాలు తమ ఇళ్లపై నల్ల జెండాలను ఎగుర వేశారు. నల్ల చొక్కాలు, నల్ల వస్త్రాలు, బ్యాడ్జీలతో రోజంతా తమ నిరసనను కేంద్రానికి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు ఇళ్ల ముందు, ఇళ్లపైన, పార్టీ కార్యాలయాలు, ముఖ్య ప్రదేశాలలో నల్లజెండాలు కట్టి, నల్లటి ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సేలం నుంచి నామక్కల్ వచ్చిన స్టాలిన్ ఉదయాన్న నల్లటి వస్త్రాలను ధరించి నిరసనలకు హాజరయ్యారు. నామక్కల్ పల్లి పాళయంలోని ఒక కార్యకర్త నివాసం ముందు నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా నల్లజెండాను ఎగురవేసి, అనంతరం ఆ బిల్లు ప్రతిని స్టాలిన్ తగలబెట్టారు. ఈ సందర్భంగా ‘తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది‘ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన నామక్కల్ రైతు బజార్‌ను సందర్శించి నల్ల వస్త్రాలతోనే వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. మదురైలో జరిగిన నిరసనలో డీఎంకే యువజన నేత, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌తో పాటుగా పెద్ద ఎత్తున డీఎంకే వర్గాలు తరలి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. నల్ల జెండాలను ప్రదర్శించారు. నల్లటి వస్త్రాలు ధరించి ఆ బిల్లు నకలు పేపర్లను తగుల పెట్టారు. చైన్నెలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం ఆవరణలో పార్టీ నేత ఆర్‌ఎస్ భారతీ నేతృత్వంలో నిరసన ప్రదర్శనలో కేంద్రం తీరుపై నాయకులు తీవ్ర స్థాయిలో శివాలెత్తారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఎన్నికలలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థులు నల్లటి వస్త్రాలతోనే కేంద్రంకు తమ నిరసనను తెలియజేస్తూ, ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. వాడ వాడలలో డీఎంకే వర్గాలు నల్ల జెండాలు ఎగుర వేసి నిరసనను విజయవంతం చేశారు.
నిరసన జ్వాల మరింతగా వ్యాపించాలి
ఈ నిరసనపై స్టాలిన్ స్పందిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడు అంతటా నిరసన జ్వాలలు వ్యాపించాలి, ఫాసిస్ట్ బీజేపీ అహంకారం నశించాలి. నాడు తమిళనాడులో మొదలైన హిందీ వ్యతిరేక ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది, వారు తలవంచే వరకు ఆ పోరాటం ఆగలేదు. నేడు తమిళులను సొంత దేశంలోనే శరణార్థులుగా మార్చే ఈ నల్ల చట్టం ప్రతిని కాల్చి మరో పోరాటాన్ని మొదలుపెట్టాను. ఈ నిప్పు ద్రావిడ దేశమంతా వ్యాపించి బీజేపీ అహంకారాన్ని అణచివేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక, ఈ నిరసనకు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, సీపీఎం నేత బాలకృష్ణన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు మద్దతు ఇస్తూ, కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే సహించబోమని, తీవ్ర పరిణామాలు తప్పదన్న హెచ్చరికలు చేశారు.


