తమిళనాడుకు నష్టం లేదు! | - | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు నష్టం లేదు!

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

కేంద్రం హామీ ఇచ్చింది

పునర్‌ వ్యవస్థీకరణపై పళణిస్వామి స్పందన

సాక్షి, చైన్నె: లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ వల్ల తమిళనాడు సహా ఏ రాష్ట్రం కూడా ప్రభావితం కాదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. కోయంబత్తూర్‌ సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిద్ధాపుదూర్‌ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం స్పష్టమైన హామీ

నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎవరికీ నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారని, ప్రజలు సంతోషించే విధంగానే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకోవడానికే సీఎం స్టాలిన్‌ స్టాలిన్‌ పునర్విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే స్టాలిన్‌ ఇలా చేస్తున్నారని విమర్శించారు.

అధికారులకు హెచ్చరిక

కోయంబత్తూరు ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడ ఎక్కడా నల్లజెండాలు కనిపించడం లేదని అన్నారు. స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిదంబరంపై ధ్వజం

కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడుకు చిదంబరం ఏం చేశారని ప్రశ్నించారు. అన్నాడీఎంకే గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. పునర్విభజన విషయంలో స్టాలిన్‌ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement