ఎన్‌టీకేకు ఊరట..! | - | Sakshi
Sakshi News home page

ఎన్‌టీకేకు ఊరట..!

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

● రైతు చిహ్నంకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, చైన్నె : నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అభ్యర్థులకు పెద్ద ఊరట గురువారం కోర్టు ద్వారా లభించింది. ఆపార్టీకి ఎన్నికల కమిషన్‌ కేటాయించిన వ్యవసాయదారుడు(రైతు) చిహ్నంను స్తంభింప చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ చిహ్నంకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు తోసి పుచ్చారు. రాష్ట్రంలో ఎన్‌టీకే 234 స్థానాలలో పోటీ చేస్తోంది. ఇందులో 116 స్థానాలలో మహిళలు, ఒక చోట హిజ్రా కూడా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం నామ్‌ తమిళర్‌ పార్టీకి ’వ్యవసాయదారుడి’ గుర్తును కేటాయించింది. అయితే, ఇది తమ పార్టీ గుర్తు ’ఏర్‌ ఉలవన్‌’(నాగలి పట్టిన రైతు) గుర్తును పోలి ఉందని, దీనివలన ఓటర్లు గందరగోళానికి గురవుతారని పేర్కొంటూ జనతా పార్టీ చైన్నె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

కోర్టులో వాదనలు

జాతీయ పార్టీ అయిన జనతా పార్టీ 1977 నుండి ’ఏర్‌ ఉలవన్‌’ గుర్తును ఆది నుంచి పార్టీ చిహ్నంగా ఉపయోగిస్తోంది. తమ గుర్తును పోలి ఉన్న గుర్తును నామ్‌ తమిళర్‌ పార్టీకి కేటాయించడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆ పార్టీ తరపున దాఖలైన పిటిషన్‌పై విచారణ హైకోర్టులో గురువారం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. ధర్మాధికారి , న్యాయమూర్తి జి. అరుల్‌ మురుగన్‌ ధర్మాసనం ఈ కేసును విచారించారు. ఆ పార్టీ తరపున న్యాయవాదుల వాదన తదుపరి ఎన్నికల కమిషన్‌ తరపున వాదనలు వినిపించారు. ఇందలో జనతా పార్టీ ప్రస్తుతం తన ఎన్నికల కమిషన్‌ గుర్తింపును కోల్పోయిందని, దృష్ట్యా,’ఏర్‌ ఉలవన్‌’ గుర్తును తమ చిహ్నంగా అని కోరే హక్కు ఆ పార్టీకి లేదని వాదించారు.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా గుర్తు చేశారు. జనతా పార్టీకి ’ఏర్‌ ఉలవన్‌’ గుర్తును, నామ్‌ తమిళర్‌ పార్టీకి ’వ్యవసాయదారుడి’ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని పిటిషనర్‌ కోర్టుకు సమర్పించలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గుర్తింపు కోల్పోయిన రాజకీయ పార్టీకి తమ పాత గుర్తుపై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను కోర్టు గుర్తు చేసింది.ఈ కారణాల రీత్యా, జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఎలాంటి అంశాలు లేదని పేర్కొంటూ దానిని న్యాయమూర్తులు తోసి పుచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement