ఈవీఎంలలో ఫొటోలు, గుర్తులు | - | Sakshi
Sakshi News home page

ఈవీఎంలలో ఫొటోలు, గుర్తులు

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

●నిక్షిప్తం చేసే పనులు ప్రారంభం ●3 లక్షల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎన్నికల కమిషన్‌ తన కార్యకలాపాలను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఈవీఎంల అభ్యర్థులు పేర్లు, ఫొటోలు, గుర్తులను పొందుపరిచే పనులను ప్రారంభించింది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులను ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో పొందు పరిచే కార్యక్రమాన్ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల అధికారులు చేపట్టారు. కరూర్‌లో అత్యధికంగా 85 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అదనపు ఈవీఎంలను ఒకదానికి మరొకటి అనుసంధానించే విధంగా గుర్తులను అమర్చారు. అంబాసముద్రంలో కనిష్టంగా కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోటీలో ఉండడం గమనార్హం.

3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ ఓటు

ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కేంద్రాలలో వీరు ఉత్సాహంగా పోస్టల్‌ ఓట్లు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత పోలింగ్‌ శిక్షణ గురువారం జరిగింది. చైన్నె జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధులు నిర్వహించే 19,604 మంది పోలింగ్‌స్టేషన్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వీరంతా తమ తపాలా ఓట్లు నమోదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్‌ కమిషనర్‌ కుమారగురుబరన్‌ పెరంబూర్‌, కె.నగర్‌ కేంద్రాలను సందర్శించి శిక్షణను పర్యవేక్షించారు. శిక్షణలో ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్‌లు, కంట్రోల్‌ పానల్‌ వినియోగం, నియమ నిబంధనల గురించి ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement