ఓడరేవుల నగరంలో గెలుపెవరిదో? | - | Sakshi
Sakshi News home page

ఓడరేవుల నగరంలో గెలుపెవరిదో?

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

● హ్యాట్రిక్‌ కోసం మహిళా మంత్రి దూకుడు ● కళ్లెం వేస్తామంటున్న అన్నాడీఎంకే, టీవీకే, ఎన్‌టీకే

తూత్తుక్కుడిలో వర్షాకాలంలో వరద నీరు నిలిచిపోవడం ప్రధాన సమస్యగా ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత ఏడాది ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించింది. దీనికి పూర్తి స్థాయి పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాగునీటి సమస్య కొంత మేరకు తగ్గినా, వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంది.

రవాణా రద్దీని తగ్గించడానికి 1, 2, 4వ రైల్వే గేట్‌ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలి.

చేపల హార్బర్‌ను ఆధునీకరించాలి.

ప్రభుత్వ న్యాయ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఏర్పాటు చేయాలి.

ఉప్పు ఉత్పత్తి వర్షాల వలన దెబ్బతిన్నప్పుడు రైతులకు ప్రభుత్వ సహాయం అందించాలి.

తూత్తుక్కుడి నుండి చైన్నెకి అదనపు రైళ్లను నడపాలి

సాక్షి, చైన్నె : దక్షిణ తమిళనాడులో అత్యంత కీలక నియోజకవర్గంగా తూత్తుకుడి ఉంది. చైన్నె తదుపరి ప్రధాన ఓడరేవు ఉన్న ఈ నగరంలో అసెంబ్లీ ఎన్నికల సందడి హోరెత్తుతోంది. ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకునేందుకు డీఎంకే మహిళా నేత , మంత్రి గీతాజీవన్‌ హ్యాట్రిక్‌ దిశగా పరుగులు తీస్తున్నారు. ఆమె వేగానికి కళ్లెం వేసే రీతిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా చెల్ల పాండియన్‌, టీవీకే అభ్యర్థిగా విజయ్‌ మిత్రుడు శ్రీనాథ్‌, నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అభ్యర్థిగా జాకబ్‌ దేవదాస్‌ అభిషేక్‌ పోటీ పడుతున్నారు. వివరాలు.. దక్షిణ భారతావనిలో ఆంగ్లేయులు కాలుపెట్టిన ఓడ రేవుల పట్టణం తూత్తుకుడి. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు, చారిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచిన తూత్తుకుడి పేరిట లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి లోక్‌ సభకు డీఎంకే అభ్యర్థిగా కనిమొళి కరుణానిధి రెండుసార్లు పార్లమెంట్‌కు వెళ్లారు. తాజాగా తూత్తుకుడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతలను కనిమొళి భుజాన వేసుకుని ఉన్నారు.

ఎన్నికల చరిత్ర

తూత్తుకుడి నియోజకవర్గం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలలో డీఎంకే ఏడు, అన్నాడీఎంకే ఆరు సార్లు గెలిచాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ గుప్పెట్లో ఉన్న ఈ నియోజకవర్గం ద్రవిడ పార్టీల ఖాతాలోకి చేరాయి. నియోజకవర్గంలో మొత్తం 2,48,300 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,20,614, మహిళలు 1,27,623, ఇతరులు 63 మంది ఉన్నారు. నియోజకవర్గంలో నాడార్‌ సామాజిక వర్గం (36), ఫెర్నాండో (19), దేవేంద్రకుల వేళాళర్‌ (9), పిళ్ళైమార్‌ (8), ముస్లింలు (4) శాతంతో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు.

తూత్తుకుడి హార్బర్‌

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు

ఎన్నికల రేసులో అభ్యర్థులు

డీఎంకే అభ్యర్థిగా మహిళా నేత, మంత్రి పీ గీతా జీవన్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఆమె ఐదవ సారిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె మూడు సార్లు గెలిచారు. అయితే, వరుస విజయాలతో ఈ సారి హ్యాట్రిక్‌ లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. ఆమైపె నియోజకవర్గంలో వ్యతిరేకత లేక పోవడం కలిసి వచ్చే అంశం. అలాగే డీఎంకే కూటమి బలం ఆమెకు అనుకూలం. అందర్నీ కలుపుకుని వెళ్లే తత్వం కలిగిన ఆమె గెలుపును అడ్డుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి చెల్ల పాండియన్‌ పోటీలో ఉన్నారు. 2011లో గెలిచిన మంత్రి పదవి చేపట్టిన ఆయన ఈ సారి గెలుపు కోసం తీవ్ర వ్యూహాలకు పదును పెట్టారు.అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌తో పాటుగా తన సామాజిక వర్గం చేయూతను ఇస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా ఆర్‌ జాకబ్‌ దేవదాస్‌ అభిషేక్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీకి ఇక్కడ 30 వేలకు పైగా ఓట్లు వచ్చాయి, ఈసారి కూడా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇక, తమిళగ వెట్రి కళగం తరపున విజయ్‌స్నేహితుడైన సినీ నటుడు శ్రీనాథ్‌ పోటీలో ఉన్నారు. మాజీ మంత్రి జీఆర్‌ ఎడ్మండ్‌ బంధువైన శ్రీనాథ్‌ మైనారిటీ ఓట్లు, ప్రభుత్వ అసంతృప్తి ఓట్లు, విజయ్‌ చరిష్మా తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఓట్ల వేటలో ఉరకలు తీస్తున్నారు. ఈ రసవత్తర సమయంలో ఓటరేవుల నగరం తూత్తుకుడిలో జెండా ఎగుర వేసేదెవ్వరో అన్నది ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement