కోర్టుకు ఉదయనిధి అఫిడవిట్‌ వ్యవహారం | - | Sakshi
Sakshi News home page

కోర్టుకు ఉదయనిధి అఫిడవిట్‌ వ్యవహారం

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

● వివరణ ఇవ్వండి ● స్పందించాలని ఐటీ శాఖకు హైకోర్టు ఆదేశం

సాక్షి, చైన్నె: డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని ఆదాయపు పన్ను శాఖను చైన్నె హైకోర్టు ఆదేశించింది. ఉదయనిధి స్టాలిన్‌ పోటీ చేస్తున్న చేపాక్కం– ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గానికి చెందిన ఓటరు కుమారవేల్‌ ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు.

పిటిషనర్‌ లేవనెత్తిన ప్రధానాంశాలు ఇవే

2021 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలో రూ. 7.36 కోట్ల పెట్టుబడి ఉన్నట్లు పేర్కొన్న ఉదయనిధి, ప్రస్తుతం (2026) ఎన్నికల అఫిడవిట్‌లో ఆ వివరాలను తెలపలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే ఆయన సతీమణి అదే సంస్థలోరూ 2.63 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు లెక్కలు చూపినట్టు వివరించారు. 2021లో స్నో హౌసింగ్‌ సంస్థకు రూ. 11.06 కోట్ల అప్పు ఇచ్చినట్లు చూపగా, తాజాగా అఫిడవిట్‌లో అది రూ. 10 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. మిగిలిన రూ 1.06 కోట్లు తిరిగి చెల్లించారా లేదా అనే వివరాలు లేవని పిటిషనర్‌ వాదించారు. అలాగే, 2020కి ముందు రూ. 2 కోట్లుగా ఉన్న ఆదాయం, ప్రస్తుతం రూ. 10.98 కోట్లుగా ఉందని, ఈ భారీ పెరుగుదలపై సరైన వివరణలు లేవని ఆరోపించారు.

విచారణకు కోర్టు స్వీకరణ

ఈ పిటిషన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్‌ మురుగన్‌ నేతృత్వంలోని బెంచ్‌ బుధవారం విచారణకు స్వీకరించింది. ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదుల తమ వాదనలో.. అభ్యర్థులు అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దీనిపై ఎన్నికల పిటిషన్‌ మాత్రమే దాఖలు చేయగలరని పేర్కొన్నారు. పిటిషనర్‌ ఫిర్యాదులోని అంశాలపై విచారణ జరిపి ఏప్రిల్‌ 20 లోపు సమాధానం ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను కోర్టు ఆదేశించింది. విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. కాగా, ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం ఉదయ నిధి ఆస్తుల వివరాలపై కోర్టు విచారణకు ఆదేశించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్‌లో సమాచారం అసంపూర్తిగా ఉండటం ప్రజా ప్రాతినిథ్య చట్టానికి విరుద్ధమని పిటిషనర్‌ తన వాదనలో గట్టిగా వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement