విజయ్‌కి వ్యతిరేకంగా బీచ్‌లో జూలీ పోరాటం | - | Sakshi
Sakshi News home page

విజయ్‌కి వ్యతిరేకంగా బీచ్‌లో జూలీ పోరాటం

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

న్యూస్‌రీల్‌

– కేసు నమోదు

తిరువొత్తియూరు: జల్లికట్టు ఆందోళన ద్వారా ప్రసిద్ధి చెందిన బుల్లి తెర నటి జూలీ, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్‌కి వ్యతిరేకంగా చైన్నె మెరీనా బీచ్‌లో అనుమతి లేకుండా నిరసన తెలిపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే పెరంబూరు నియోజకవర్గంలో విజయ్‌ను విమర్శిస్తూ ప్రచారం చేసిన జూలీ, మంగళవారం సాయంత్రం మెరీనా ఔవయ్యార్‌ విగ్రహం వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆకస్మికంగా నిరసనలో పాల్గొన్నారు. ఒక చేతిలో డీఎంకేకు ఓటు వేయండి అనే బ్యానర్‌ను, మరో చేతిలో విజయ్‌ను ఉద్దేశించి ఉడుత బొమ్మ వేసి దానిపై ’ఎక్స్‌’ గుర్తు వేసిన బ్యానర్‌ను పట్టుకుని ఆమె నినాదాలు చేశారు. ముఖ్యంగా, తమిళగ వెట్రికళగం ద్వారా మహిళలకు రక్షణ లేదు అనే వాక్యం ఉన్న ప్లకార్డును జూలీ పట్టుకోవడం విజయ్‌ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. సమాచారం అందుకున్న మెరీనా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో నిరసన తెలిపిన జూలీతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో సరైన అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదని సూచించిన పోలీసులు, ఆమె నుంచి క్షమాపణ లేఖ రాయించుకుని విడుదల చేశారు.

రూ. 8 వేల కూపన్ల పంపిణీ

– ఈసీకి ఆధారాలతో

అన్నాడీఎంకే ఫిర్యాదు

సాక్షి,చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. కోయంబత్తూర్‌ సౌత్‌, బర్గూర్‌, పాలక్కోడు , చైన్నె కొళత్తూరు తదితర పలు కీలక నియోజకవర్గాల్లో డీఎంకే నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ. 8 వేలు విలువైన కూపన్లను పంపిణీ చేస్తున్నారని అన్నాడీఎంకే ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే రాష్ట్ర న్యాయవాద విభాగం డిప్యూటీ సెక్రటరీ ఆర్‌.ఎ.ఎస్‌. సెంథిల్‌ వేల్‌ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపిన ఫిర్యాదులో కూపన్ల పంపిణి గురించి వివరించారు. అధికారంలోకి వస్తే, ఫ్రిజ్‌,వాషింగ్‌ మిషన్‌ తదితర గృహోపకరణలను కొనుగోలు చేసుకోవచ్చని డీఎంకే ఎన్నికల వాగ్దానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిని ముందుగానే అమలు పరిచే విధంగా డీఎంకే నాయకులు పలు నియోజకవర్గాలలో రూ.8 వేలు గిప్ట్‌ కూపన్ల పంపిణీలో నిమగ్నమైనట్టు వివరించారు. అనేక కీలక నియోజకవర్గాలలో ఈ పంపిణీ జోరుగా జరుగుతున్నట్టు, సీరియల్‌ నెంబర్లతో కూడిన కూపన్ల వివరాలను సైతం ఫిర్యాదులో పొందు పరిచారు. దీంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఈ కూపన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కూప్లను పంపిణి ఆపకుంటే చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. తమకు పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement