చైన్నెలో రేపటి నుంచి పోస్టల్‌ ఓటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో రేపటి నుంచి పోస్టల్‌ ఓటింగ్‌

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

సాక్షి,చైన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చైన్నె జిల్లా ఎన్నికల అధికారి బుధవారం కీలక ప్రకటన చేశారు. ఈనెల 17, 18 తేదీలలో చైన్నెలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నామన్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఇంటి నుంచే ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది నేరుగా వారి వద్దకే వెళ్లనున్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు , ఎన్నికల సిబ్బంది ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు వారికి కేటాయించిన కేంద్రాలలో పోస్టల్‌ ఓటు వేసుకునే అవకాశం కల్పించారు.

కొత్త డీజీపీ నియామకంపై వివాదం

తమిళనాడు కొత్త డీజీపీగా సందీప్‌ రాయ్‌ రాథోర్‌ నియామకంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మాజీ డీజీపీ శంకర్‌ జివాల్‌ పదవీ విరమణ తర్వాత, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కొత్త డీజీపీ ఎంపిక జరగాలని డీఎంకే వాదిస్తోంది. ఎన్నికల సమయంలో నియమించబడిన అధికారిని శాశ్వత ప్రాతిపదికన కొనసాగించడం చట్టవిరుద్ధమని, ఇతర రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్‌ వంటివి) అనుసరించిన పద్ధతినే ఇక్కడ కూడా పాటించాలని ఎన్నికల కమిషన్‌ను డీఎంకే డిమాండ్‌ చేసింది.

ఖైదీలకు ఓటు హక్కు

తమిళనాడులో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, జైళ్లలో ఉన్న నిర్బంధ ఖైదీలకు కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. గుండా చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఖైదీలకు మాత్రమే పోస్టల్‌ ఓటింగ్‌కు పచ్చజెండా ఊపారు. జైళ్ల శాఖ ఏడీజీపీ శంకర్‌ నేతృత్వంలో ఓటర్ల వివరాలు సేకరించారు. చాలా మంది ఖైదీలకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15 మంది ఖైదీలు ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 132కి పెరగడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement