కూవాగంలో హిజ్రాల పండుగ | - | Sakshi
Sakshi News home page

కూవాగంలో హిజ్రాల పండుగ

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

● కూత్తాండవర్‌ ఆలయ ఉత్సవాలకు శ్రీకారం ● 28న పెళ్లి సందడి

సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల వసంతోత్సవ వేడుకకు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం కూత్తాండవర్‌ ఆలయంలో ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్‌ హిజ్రాలకు ఆరాధ్యుడు. ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలు దేశ విదేశాల్లోని హిజ్రాలు తరలి వస్తుంటారు. ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాధ ముడి పడి ఉందని పురాణాలు చెబుతాయి. ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన కూత్తాండవర్‌(ఐరావంతుడి) ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధం అవుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువ జాము వరకు కూత్తాండవర్‌ సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో ధ్వజారోహణం జరిగింది. ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలు రాగి గంజిని తయారు చేసి కుండలు, బిందెల్లో పోసి ఊరేగించారు. స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక, ఉపవాస వ్రతంతో ఆలయ అర్చకులు రోజూ పూజలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటూ పరిసర గ్రా మాల ప్రజలు ఆలయంలో వివిధ పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

28న పెళ్లి సందడి

ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిజ్రాలు తరలి వస్తారు. ఈనెల 28వ తేదీన హిజ్రాల పెళ్లి సందడి కూవాగంలో నెలకొననుంది. ఈ వేడుక నిమిత్తం హిజ్రాలు కూవాగంకు పోటెత్తనున్నారు. వీరి బస కోసం అక్కడి లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, విడిదులు ముస్తాబు అవుతున్నాయి. హి జ్రాలకు అందాల పోటీలు సైతం ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజైన 29వ తేదీన కూత్తాండవర్‌ రథోత్సవం, హిజ్రాలు తాళి బొట్టు తెంచి వితంతువుగా మారే విషాద కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డు, స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో హిజ్రాల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement