తమిళసినిమా: ఇటీవల తాయ్ కిళవి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కాలనీ. అదేవిధంగా నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన అరమ్ చిత్రం ఫేమ్ గోపి నయినార్ దర్శకత్వం వహించిన నూతన చిత్రం ఇది. ఈయన ఇంతకుముందు ర్శకత్వం వహించిన మనుషి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో తర్వాత కాలనీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతిధి మూవీస్ పతాకంపై డాక్టర్ ఆర్.రంగనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు లియో, రాధికా కుమారుడిగా నటించారు. అంజలినాయర్, ఎంఎస్.భాస్కర్ , చేతన్, ఆర్కే విజయమురుగన్, వినోద్ సాగర్, మూనార్ రమేష్, అజిత్ ఘోషి, రవి వెంకట్రావ్, జేకేఏ వెంకటేష్, దర్శకుడు తమిళ్, గీతా కై లాసం, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. చిన్న విరామం తరువాత దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.దేవరాజ్ చాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు వెట్రిమారన్, విజయ్‌సేతుపతి కలసి విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు గోపి నయినార్ తెలుపుతూ కుమారుడిని కోల్పోయిన తల్లి న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్రం అని చెప్పారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు.


