క్లిష్టమైన గుండె చికిత్సలకు ప్రత్యేక ప్రోగ్రామ్‌ | - | Sakshi
Sakshi News home page

క్లిష్టమైన గుండె చికిత్సలకు ప్రత్యేక ప్రోగ్రామ్‌

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

సాక్షి, చైన్నె: వైద్య రంగంలో మరో ముందడుగు వేస్తూ, రేడియల్‌ రోడ్డులోని కావేరీ హాస్పిటల్‌ ’కాంప్లెక్స్‌ హై–రిస్క్‌ ఇండికేటెడ్‌ ప్రొసీజర్స్‌’ అనే అత్యాధునిక కార్డియాక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, ముఖ్యంగా తీవ్రమైన గుండెపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ కేసుల్లో మెరుగైన చికిత్స అందించడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్య ఉద్దేశ్యంగా వైద్యులు ప్రకటించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ అజిత్‌ పిళ్లై మాట్లాడుతూ, అమెరికా, యూరప్‌లోని అగ్రశ్రేణి కార్డియాక్‌ ఆసుపత్రుల తరహాలో ఇక్కడ బహుళ విభాగాలకు చెందిన నిపుణులు (మల్టీ డిసిప్లినరీ టీమ్‌) కలిసి పనిచేస్తారని ప్రకటించారు. ఇందులో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టులు, సర్జన్లు, అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్‌ కేర్‌ నిపుణులు ఉంటారని వివరించారు. ఆసుపత్రికి అత్యవసర స్థితిలో వచ్చే రోగులను కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే పరీక్షించి, చికిత్స ప్రారంభించేలా ప్రోటోకాల్స్‌ రూపొందించామన్నారు. క్లిష్టమైన సర్జరీలు జరుగుతున్నప్పుడు గుండెకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చేందుకు ఎక్మో, మైక్రో–యాక్సియల్‌ కార్డియాక్‌ పంప్స్‌ వంటి పరికరాలను ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ మాట్లాడుతూ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడడంలో సమయపాలన , నైపుణ్యం చాలా ముఖ్యమన్నారు. ఈ విభాగం ద్వారా అంతర్జాతీయ స్థాయి గుండె చికిత్సలను రోగులకు మరింత దగ్గర చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement