రోడ్‌ షోలతో విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

రోడ్‌ షోలతో విస్తృత ప్రచారం

Apr 16 2026 10:18 AM | Updated on Apr 16 2026 10:18 AM

● నాగర్‌కోయిల్‌లో పీఎం మోదీ ● గెలుపు తథ్యమని ధీమా ● చైన్నె రోడ్లలో విజయ్‌ ● పాలక్కోడులో సీఎం స్టాలిన్‌ సందడి

సాక్షి, చైన్నె: ప్రసంగాలను పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయ్యే రీతిలో బుధవారం రాష్ట్రంలో ప్రచారాన్ని నాయకలు హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాగర్‌ కోయిల్‌ రోడ్లపై ప్రచార వాహనం నుంచి ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఇక, చైన్నెలోని టీ నగర్‌, థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గాల పరిధిలోని రోడ్లు, వీధులలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ దూసుకెళ్లారు. సీఎం స్టాలిన్‌ యథా ప్రకారం వాకింగ్‌తో పాలక్కోడులో సైతం జనానికి దగ్గరయ్యే విధంగా ముందుకు సాగారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. అభ్యర్థులు ఓపెన్‌టాప్‌ వాహనాలలో సుడిగాలి ప్రచారంలో ఉన్నారు. ముఖ్య నేతల రాక తమిళనాడులో పెరిగింది. ఎన్‌డీఏ కూటమి మద్దతుగా కేంద్ర మంత్రులు ఓవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ మరో వైపు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.

పళణికి మోదీ బెస్ట్‌ ఆఫ్‌ లక్‌

కన్యాకుమారి జిల్లాలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పీఎం నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నాగర్‌ కోయిల్‌కు వచ్చిన ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు అన్నామలై, పొన్‌రాధాకృష్ణన్‌లతో కలిసి ఒకే ఓపెన్‌ టాప్‌వాహనంలో రోడ్‌ షో నిర్వహించారు. సుమారు రెండు కీ.మీ దూరంలో ఈ రోడ్‌ షో జరిగింది. రోడ్డుకు ఇ రువైపులా ఉన్న జనానికి అభివాదం తెలుపుతు పీఎం మోదీ ముందుకు సాగారు. నాగర్‌ కోయిల్‌ జంక్షన్‌లోని దివంగత నేతలు అన్నాదురై, ఎంజీఆర్‌, కామరాజర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలు, చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన కన్యాకుమారి జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అదే సమయంలో మనం గెలుస్తున్నాం అంటూ పళణి స్వామి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అని పీఎం మోదీ శుభాకాంక్షలు తెలపడం విశేషం.

చైన్నె రోడ్లలో విజయ్‌ షో

టీవీకే అధ్యక్షుడు విజయ్‌ చైన్నె రోడ్లలో చక్కర్లు కొడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. టీ నగర్‌లో పోటీ చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు మద్దతుగా పలు వీధులలో ఓపెన్‌ టాప్‌వాహనం ద్వారా చక్కర్లు కొట్టారు. ఆయన్ను చూసేందుకు జనం దారి పొడవున బారులు తీరారు. కొన్ని జంక్షన్లలో పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో వారిని కట్టడి చేయలేక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఎక్కడప్రసంగాలకు తావివ్వకుండా పలు వీధుల గుండా విజయ్‌ ప్రచారం జరిగింది. అనంతరం థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గం పరిధిలోని వీధులు, రోడ్లలో విజయ్‌ ప్రచార వాహనం దూసుకెళ్లింది. ఈ చిహ్నంను చూపిస్తూ, ప్రజలకు అభివాదం తెలుపుతూ,అభ్యర్థులను పరిచయం చేస్తూ విజయ్‌ రోడ్‌ షో ఆద్యంతం జనాకర్షణ దిశగా జరిగింది.

సీఎం స్టాలిన్‌ వాకింగ్‌

ధర్మపురి జిల్లా పాలక్కోడులో ఉదయం సీఎం స్టాలిన్‌ వాకింగ్‌కు వెళ్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆయన నడుచుకుంటూ ముందుకు సాగారు. ఈ ప్రచారంలో ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అమితాసక్తి చూపారు. కోట వీధిలోని ముస్లిం సోదరుల నివాస ప్రాంతాల నుంచి ఆయన తన నడకను ప్రారంభించి ప్రజలను పలకరించారు. ప్రచారం సాగుతుండగా ఒక దంపతులు తమ బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా కోరగా, ఆ చిన్నారికి సీఎం స్టాలిన్‌ ‘ద్రావిడన్‌’ అని పేరు పెట్టారు. ఇది అక్కడ ఉన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. పాలక్కోడు స్తూపి మైదానం, ప్రధాన బజారు వీధి, బస్టాండ్‌, టమాటా మండి వంటి రద్దీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. స్థానిక వ్యాపారులు, ప్రజలతో కరచాలనం చేస్తూ డీఎంకే కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక, సాయంత్రం 5 గంటలకు తడంగం పంచాయతీ పరిధిలోని కోర్టు కాంప్లెక్స్‌ సమీపంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో ధర్మపురి జిల్లాలోనిటి.ఎన్‌.వి. సెంథిల్‌ కుమార్‌ (పాలక్కోడు – డీఎంకే),జి.కె.ఎం. తమిళ్‌ కుమరన్‌ (పెన్నాగరం – కాంగ్రెస్‌), డాక్టర్‌ ఇలంగోవన్‌ (ధర్మపురి – డీఎండీకే), పళనియప్పన్‌ (పాపిరెడ్డిపట్టి – డీఎంకే),షణ్ముగం (అరూర్‌ – డీఎంకే) లకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement