సాక్షి, చైన్నె: వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బుధవారం పాపులర్ ఎస్‌యూవీ ’టెగన్ సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. బుధవారం స్థానికంగా ఈ వివరాలను ఆ సంస్థ డైరెక్టర్ నితిన్ కోహ్లీ ప్రకటించారు. ఈ కొత్త మోడల్ 40కి పైగా కొత్త అప్‌డేట్‌లు, 9 రంగుల ఎంపికలు , పరిశ్రమలోనే మొదటిసారిగా 75 శాతం అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌తో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చామన్నారు. . ఈ ఆఫర్ మే 31 వరకు బుక్ చేసుకునే కొత్త టైగన్ కార్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. టైగన్ ఒక మూలస్తంభం అని, కొత్త అప్‌డేట్‌లు, ఆకర్షణీయమైన బైబ్యాక్ ప్రోగ్రామ్‌తో వినియోగదారులకు మరింత మెరుగైన విలువను అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.
అన్నానగర్: చైన్నెలోని రాయపేటలో అవ్వై షణ్ముగం రోడ్డులో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం రాయపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలించగా, రాయపేటలోని ముత్తయతోట్టం ప్రాంతానికి చెందిన పెరుమాల్ (28) ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు వెల్లడైంది. దీంతో బుధవారం పోలీసులు అతడిని అరెస్టు చేసి చోరీకి గురైన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
కొరుక్కుపేట: ఇస్కాన్ చైన్నెలో భజన్ క్లబ్బింగ్ తొలి సంగీత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నగరవ్యాప్తంగా యువత నుండి అద్భుతమైన స్పందన, భారీ సంఖ్యలో భాగస్వామ్యం లభించింది.ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సమావేశంగా నిలిచింది. సంగీతం, నత్యం, మంత్ర ధ్యానం, సామూహిక భాగస్వామ్యం శక్తివంతంగా ఏకమవ్వడంతో వాతావరణం ఉత్సాహభరితంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే విధంగా సాగింది. ప్రత్యేక ఆకర్షణగా, శ్రీ జయపతాక స్వామి మహారాజ్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశీర్వదించడం.
సాక్షి, చైన్నె: దేశీయ డైరీ పానీయాల రంగంలో దూసుకెళ్తున్న ఉన్న కావిన్‌కేర్ తాజాగా బహుళ–బిలియన్ల విలువైన భారతీయ ఐస్ క్రీమ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన ప్రీమియం బ్రాండ్ ‘కావిన్స్’ పేరుతో సరికొత్త ఇన్ఫ్యూజన్–ఆధారిత ఐస్ క్రీమ్ శ్రేణిని చైన్నెలో బుధవారం ఆవిష్కరించింది.24 ఫ్లేవర్లు, 7 ఇన్ఫ్యూజన్ కేటగిరీలలో కలిపి 72 రకాల వైరెటీలను సంస్థ పరిచయం చేసింది. ఐస్ క్రీమ్ పార్లర్లలో లభించే విధంగా పండ్లు, చాక్లెట్లు, నట్స్ , భారతీయ స్వీట్లను నేరుగా ఐస్ క్రీమ్‌లో కలిపి ‘పార్లర్–శైలి’ అనుభూతిని నేరుగా వినియోగదారుల ఇళ్లకే అందించడం దీని ప్రత్యేకత అని ఆ సంస్థ చైర్మన్ సికే రంగనాథన్, బిజినెస్ హెడ్ శ్రీవత్సవ్‌కృష్ణమూర్తి తెలిపారు. దేశంలో ఐస్ క్రీమ్ ఇప్పుడు కేవలం సీజనల్ ట్రీట్ మాత్రమే కాదని, అది ఒక అనుభూతిగా మారిందన్నారు. వినియోగదారుల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కావిన్స్‌తో ఈ విభాగంలోకి ప్రవేశించిందన్నారు.
అన్నానగర్: సాత్తూరు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆమ్ని బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్లస్‌టూ విద్యార్థులు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లాలోని శివకాశి సమీపంలోని పెరనాయకన్‌పట్టికి చెందిన సెల్వం కుమారుడు గోకుల్ (17). ఇతను శివకాశిలోని ఒక ప్రైవేట్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో ప్లస్‌టూ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ స్థితిలో, గోకుల్ సెల్‌ఫోన్ పాడైపోవడంతో రిపేర్ చేసుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం బైక్‌లో శివకాశికి వెళ్లాడు. దుకాణంలో రిపేర్‌కు ఇచ్చి శివకాశిలో తనతో పాటు చదువుకున్న సహ విద్యార్థులు ప్రసన్న (17), యువరాజ్ (17)లను కలిశాడు. గోకుల్ రాత్రి 9 గంటలకు తన స్నేహితులతో కలసి సెల్‌ఫోన్ దుకాణానికి వెళ్లి, సెల్ తీసుకున్నాడు. అనంతరం రాత్రి 11.45 గంటలకు, ఆ ముగ్గురూ బైక్‌లో టీ తాగడానికి దుకాణానికి వెళ్లారు. సాత్తూరు–కోవిల్‌పట్టి నాలుగు లేన్ల జాతీయ రహదారిలో వెళుతుండగా అదేసమయంలో వస్తున్న ఒక ప్రైవేట్ ఆమ్నిబస్సు బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న సాత్తూరు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం సాత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


