● బంగారు బిస్కెట్ల స్వాధీనం
అన్నానగర్: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో సరైన పత్రాలు లేకుండా తీసుకువచ్చిన రూ. 44.83 లక్షలు, బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, రైల్వే పరిరక్షణ దళం చైన్నెలోని రైల్వే స్టేషన్లలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తోంది. సరైన పత్రాలు లేకుండా రైళ్లలో తీసుకువస్తున్న డబ్బు, బంగారం, వెండి కడ్డీలు, మాదకద్రవ్యాలను వారు స్వాధీనం చేసుకుని, వాటిని ఆదాయపు పన్ను శాఖకు, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ స్థితిలో, మంగళవారం చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వస్తువులను తనిఖీ చేయడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన రెడ్డి నేతృత్వంలో పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో, సేలం నుంచి రైలులో సెంట్రల్ కు వచ్చిన జయరాజ్ (43) అనే ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతని బ్యాగులో 289 గ్రాముల బరువున్న 4 బంగారు బిస్కెట్లు, నగదు ఉన్నట్లు వెల్లడైంది. అయితే, అందుకు సంబంధించిన పత్రాలు అతని వద్ద లేవు. దీంతో రూ. ఏడున్నర లక్షల విలువైన బంగారు కడ్డీలను, రూ. 44.83 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.
సాక్షి,చైన్నె: సిలికాన్ కేథడర్ తదితర వైద్యపరికరాల తయారీలో పేరుగాంచిన జపాన్‌కు చెందిన క్రియేట్ మెడిక్ కో రాష్ట్రంలో తన ప్రత్యక్ష అమ్మకాలను ప్రారంభించినట్లు, దేశవ్యాప్తంగా విస్తరణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఒసాము ఇమాజావా తెలిపారు. చైన్నెలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మెడి నిప్పన్ సంస్థ ద్వారా తమ అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయని, తమిళనాట తమ సంస్థ కార్యాలయాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తారమైన వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు అందుబాటులో ఉండటంతో తమ సంస్థ అమ్మకాలు 8 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యచికిత్సలకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా తమ సంస్థ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. సమావేశంలో క్రియేట్ మెడిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కట్సుయాకీ యామనే, డైరెక్టర్ కూసుకే సుటో తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓటింగ్ యంత్రాలలో అభ్యర్థుల వివరాలను నిక్షిప్తం చేసే కీలక ఘట్టం గురవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లను కేటాయించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రెండో దశ రాండమైజేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుండి 16 వరకు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. తదుపరి గురువారం నుంచి ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వారి ఎన్నికల గుర్తులను లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందరన్నారు. ఈ పనులన్నీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఏ పోలింగ్ కేంద్రానికి ఏ యంత్రాన్ని కేటాయించారో తెలిపే పూర్తి జాబితాను (సీరియల్ నంబర్లతో సహా) అభ్యర్థులందరికీ అందజేస్తామన్నారు.


