తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్‌పై అవగాహన కల్పించే విధంగా దివ్యాంగుల అవగాహన ర్యాలీని తిరుత్తణిలో బుధవారం నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుత్తణి కొత్త బస్టాండు వద్ద 70 మంది దివ్యాంగులు పాల్గొన్న ట్రై స్కూటర్ ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ బెలూన్లు గాలిలో ఎగురవేశారు. దివ్యాంగులు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ఇతరులకు స్ఫూర్తిగా వుండాలని ఆకాంక్షించారు. తహసీల్దార్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్, దివ్యాంగుల జిల్లా అధికారి కుమార్ పాల్గొన్నారు.


