● మహిళ మృతి
అన్నానగర్: అవడి సమీపంలో జరిగిన లారీ కారు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తాంబరం సమీపంలోని నందివరం ప్రాంతంలోని గూడువాంచేరికి చెందిన త్యాగు(41) ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పేరు శాలిని (33). ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమిళ న్యూయర్ సందర్భంగా, త్యాగు, ఇతని భార్య శాలిని పూజ కోసం తిరువళ్లూరు జిల్లాలోని సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం వారు కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, రెడ్ హీల్స్ సమీపంలోని కాట్టూర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ త్యాగు నడుపుతున్న కారు వెనుక టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీ వెనుక భాగాన్ని వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ముందు సీటులో కూర్చున్న శాలిని తీవ్రంగా గాయపడి మరణించారు. త్యాగు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఆవడి ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతురాలు శాలిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ శివ(40)ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


