వేలూరు: జిల్లాలోని మొత్తం 1,427 పోలింగ్ కేంద్రాలను వెబ్ కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం వేలూరులో పోలింగ్ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఆమె తనఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 5 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1,427 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 193 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే ఐదు చోట్ల నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఓట్లు వేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె అనకట్టు నియోజకవర్గంలోని అరియూరులో పోలింగ్ సిబ్బంది శిక్షణను ఆమె తనఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు.


