కుష్బూ వారసురాలు రెడీ!
తమిళసినిమా: ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్‌కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్ సెల్వన్ 1, 2, థగ్‌లైఫ్ చిత్రాలకు పని చేశారు. కాగా పెద్ద కూతురు అవంతిక హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్‌లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శనివారం ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు.
తల్లి కుష్భుతో అవంతిక


