‘రివాల్డో’ కన్నుమూత
అటవీ గ్రామాల ప్రజలు
సాక్షి, చైన్నె: గ్రామీణ ప్రజల కుటుంబాల్లో తానూ ఒక్కడినే అన్నట్టుగా రెండున్నర దశాబ్ధాల పాటూ నీలగిరులలో చక్కర్లు కొట్టిన రివాల్డో ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు రివాల్డోకు కన్నీటి నివాళులర్పించారు. వివరాలు.. నీలగిరి అడవులలోని అరటి తోట తదితర గ్రామాలలో తరచూ అడవి ఎనుగులు సంచారం అధికంగా ఉండేది. ఏనుగులను చూస్తే చాలే జనం భయంతోవణికిపోతారు. అయితే, ఈ ఏనుగుల గుంపు నుంచి బయటపడ్డ ఓ ఏనుగు పూర్తి భిన్నంగా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్య పరిచేది. ఇంటిముందు నిలబడి తొండం పైకి ఎత్తి తనకు ఆహారం, నీళ్లు కావాలనిసైగ చేయడం మొదలెట్టింది. దీంతో ఈ ఏనుగు అక్కడి గ్రామాల ప్రజల కుటుంబాల్లో ఒకటిగా మారింది. దీనికి రివాల్డో అని కూడా నామకరణం చేశారు. ఇంత వరకు ఈ ఏనుగు ఎవ్వరికి ఎలాంటి హానీ కలిగించకపోవడం గమనార్హం.2021లో తొండం వద్ద తీవ్ర గాయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
మరింత మచ్చికగా..
గాయంతో బాధపడుతున్న రివాల్డోను తెప్పకాడు ఏనుగుల శరణాలయానికి తీసుకెళ్లారు. ఇక్కడ అన్ని రకాల చికిత్స అందించారు. ఇతర ఏనుగులతో కలిసి పోవడం, అందరితో కలుపుగోలుగా ఉండటం, అందర్నీ ఆశ్చర్య పరిచే విధంగా వ్యవహార శైలి ఉండటంతో దీనిని కుంకీగా మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జంతు ప్రేమికుల కారణంగా మళ్లీ రివాల్డోను అడవిలోకి పంపించక తప్పలేదు. అయితే మూడు నెలల క్రితం హఠాత్తుగా రివాల్డో జాడ కాన రాలేదు. అరటితోట పరిసర వాసులు రివాల్డో కోసం గాలించారు. ఈ పరిస్థితులలో గత వారం తీవ్ర గాయాలతో రివాల్డోను గుర్తించారు. మరో ఏనుగుతో జరిగిన భీకర గొడవలో గాయాలైనట్టుగా గుర్తించారు. వయోభారం, తీవ్ర గాయాలతో నడవ లేని స్థితిలో ఉన్న రివాల్డోకు చికిత్స అందించారు. ఆ పరిసర వాసులు దానికి కావాల్సిన ఆహారం తీసుకొచ్చిపెట్టారు. కానీ మళ్లీ తమ ముందు ఆనందంతో రివాల్డో తిరుగుతుందని ఎదురు చూసిన ఆపరిసర గ్రామాల ప్రజలకు శనివారం ఉదయాన్నే చేదు వార్త చేరింది. రివాల్డో కన్నుమూసిన సమాచారంతో ఆ పరిసర వాసులు కన్నీటి సంద్రంలోమునిగారు. ఆంగ్లలో పిలిచినా, తమిళంలో పిలిచినా, తొండాన్ని ఆడిస్తూ, తనకు కావాల్సిన ఆహారం తినేసి ఎవరికీ ఎలాంటి హానీ తలబెట్టకుండా వెళ్లే రివాల్డోను తలచుకుంటూ అనేక కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. తమకు రివాల్డోతో రెండున్నర దశాబ్దాల అనుబంధం అని అరటి తోట గ్రామస్తులు రివాల్డోనుతలచుకుంటూ తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయామన్న మనో వేదనను వ్యక్తం చేయడం గమనార్హం.


