నటుడైన రాజకీయ నేత
తమిళసినిమా: నటులు రాజకీయ నాయకులు కావడం, రాజకీయ నాయకులు నటులుగా మారడం సర్వసాధారణం. అలా తాజాగా కమ్యునిస్టు నాయకుడు ఆర్.ముత్తరసన్ నటుడిగా అవతారం ఎత్తి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అరిసి. నటుడు, దర్శకుడు సముద్రఖని, సుబ్రమణి శివ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మోనికా ప్రొడక్షన్స్, అరుంధవం మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎస్ ఏ.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వ్యవసాయం, రైతుల ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని వళ్లువర్‌కోట్టంలో నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైగో,తోళ్ తిరుమావళవన్, ఆర్కే సెల్వమణితోపాటు పలువురు కమ్యూనిస్ట్ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయనిధి స్టాలిన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా వైగో తొలి ప్రతిని అందుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇంతకాలం రాజకీయనాయకుడిగా ప్రజా సేవలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆర్.ముత్తరసన్ ఇప్పుడు సినీ రంగప్రవేశం చేసి, ఇక్కడ కూడా మంచి సామాజిక బాధ్యతతో కూడిన చిత్రాలను చేయడానికి సిద్ధం అయ్యాయన్నారు. అలా తొలి ప్రయత్నంగా రైతుల ఇతివృత్తంతో కూడిన అరిసి చిత్రాన్ని నిర్మించడంతో పాటు ముఖ్యపాత్రలో నటించాలని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని, ఆర్.ముత్తరసన్ రాజకీయ, సినీ రంగాల్లో తన సేవలను అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


